రేషన్ షాపుల్లో ఇవ్వాల్సిన గోధుమలు, కిరోసిన్ ఎక్కడ?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇంతవరకూ ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గురువారం శాసన మండలిలో బడ్జెట్ పై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  రేషన్ షాపుల్లో ఇవ్వాల్సిన తొమ్మిది రకాల సరుకులు ఏమైయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పండుగ పూట చక్కెర, గోధుమలు, కిరోసిన్ ఏవీ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రూ. 50 వేల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఒకేసారి, 50 వేల పైచిలుకు లబ్ధిదారులకు రెండు విడతల వారిగా మాఫీ చేయాలని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగులో ఆపరేషన్లు చేయడం లేదన్నారు, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు జీవన్ రెడ్డి. ఆయుష్మాన్ భారత్ ను కూడా రాష్ట్రంలో అమలు చేయాలని, ఆ పథకాన్ని అమలు చేస్తే.. ఆరోగ్య శ్రీని నిలిపివేయవద్దని చెప్పారు. బడ్జెట్ లో విద్య కోసం రూ.14,728 కోట్ల నిధులు కేటాయించారని చెప్పిన జీవన్ రెడ్డి.. విద్య పై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.

బుధవారం అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టిన విద్యార్థుల పట్ల పోలీసులు నియంతృత్వముగా వ్యహరించారని ఆయన అన్నారు. గ్రూప్స్ నోటిఫికేషన్ పై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన లేదని, యూనివర్సిటీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఉపాద్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు కావడం లేదన్నారు జీవన్ రెడ్డి.

Latest Updates