కేసీఆర్ ఫామ్ హౌస్‌కీ క‌రోనా వ‌స్త‌ది.. ఇది నా శాపం: ఎంపీ కోమటిరెడ్డి

  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో పాజిటివ్ కేసులొస్తే ఫామ్ హౌస్‌కి వెళ్తే అక్క‌డ రాదా?
  • ముఖ్య‌మంత్రి అయింది ప్ర‌జ‌ల్ని పాలించ‌డానికా.. చంప‌డానికా?
  • ఇప్ప‌టికైనా క‌రోనాను ఆరోగ్య శ్రీ కింద చేర్చాలి

తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డి చేయ‌డంలో సీఎం కేసీఆర్ ఘోరంగా వైఫల్యం చెందారని అన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. ప‌క్క రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ది ల‌క్ష‌ల‌పైగా టెస్టులు చేస్తే తెలంగాణ‌లో ల‌క్ష మాత్ర‌మే జ‌రిగాయ‌ని, ఇది కేసీఆర్ వైఫ‌ల్యం కాదా అని ప్ర‌శ్నించారు. ఏపీ, ఢిల్లీ ప్ర‌భుత్వాల‌ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాల‌ని సూచించారు. ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌ను క‌రోనా ట్రీట్మెంట్ కోసం వినియోగిస్తున్నార‌ని అన్నారు కోమ‌టిరెడ్డి. మ‌న రాష్ట్రంలో మాత్రం మెరుగైన చికిత్స అందించడంలో వైఫ‌ల్యం చెందుతున్నార‌ని, టెస్టుల సంఖ్య పెంచ‌కుండా వైర‌స్ వ్యాప్తికి పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌‌య్యార‌ని ఆరోపించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌రోనా కేసులు వ‌చ్చాయ‌ని, సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లార‌ని, అక్క‌డికి క‌రోనా రాదా అని ప్ర‌శ్నించారు ఎంపీ కోమ‌టిరెడ్డి. పైన దేవుడు ఉన్నాడ‌ని, ఫామ్ హౌస్‌కు కూడా క‌రోనా వ‌స్త‌ద‌ని, ఇది త‌న శాప‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేయ‌కుండా టెస్టుల సంఖ్య పెంచాల‌ని, మెరుగైన వైద్యం అందించాల‌ని, లేకుంటే ప్ర‌జ‌లు బుద్ధి చెబుతార‌ని కేసీఆర్‌ను హెచ్చ‌రించారు. క‌రోనా స‌హాయ చ‌ర్య‌ల కోసం వచ్చిన కోట్ల విరాళాలు ఎక్కడకు పోయాయ‌ని ప్ర‌శ్నించారు. మేధావులు,విద్యావంతులు, ప్రజలు కేసీఆర్ వైఖరిని గమనించాల‌ని కోరారు.

ప్ర‌జ‌ల బాగోగులు చూడు

కేసీఆర్ సీఎం అయింది ప్ర‌జ‌ల‌ను పాలించ‌డానికా లేక చంప‌డానికా అని ప్ర‌శ్నించారు ఎంపీ కోమ‌టిరెడ్డి. తెలంగాణ‌లో ఇలాంటి ముఖ్య‌మంత్రి ఉండ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల బాగోగుల‌పై కేసీఆర్ దృష్టి పెట్టాల‌ని కోరారు. త‌క్ష‌ణం క‌రోనా టెస్టింగ్ పెంచాల‌ని, ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి ఫీజు వ‌సూలు చేయ‌కుండా ఆదేశాలివ్వాల‌ని చెప్పారు. క‌రోనా బారిన‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌కు భారం కాకుండా త‌క్ష‌ణం క‌రోనాను ఆరోగ్య శ్రీ కింద చేర్చాల‌ని డిమాండ్ చేశారు.

Latest Updates