క‌రెంటు బిల్లుల‌పై వ‌డ్డీలు వ‌సూలు చేస్తామ‌న‌డం దారుణం

  • క‌రోనాతో కుటుంబ‌పోష‌ణే క‌ష్ట‌మైన పేదోడికి క‌రెంట్ షాకులా?
  • క‌రెంటు బిల్లుల‌తో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి జ‌నాల‌ జేబుకు చిల్లు
  • సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

రాష్ట్రంలో క‌రెంటు బిల్లులు లెక్క‌గ‌ట్టిన తీరుతో పేద‌వాడి జేబుకు చిల్లు పెడుతున్నారంటూ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ నేత‌, మ‌ల్కాజ్ గిరిఎంపీ రేవంత్ రెడ్డి. కరోనా నేపథ్యంలో ఉపాధి పోయి… కుటుంబ పోషణే కష్టమైన పేద, మధ్య తరగతికి కరెంట్ షాక్ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో క‌రెంటు బిల్లులు భారీగా రావ‌డంతో ప్ర‌జ‌ల ఇబ్బందిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొస్తూ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు బ‌హిరంగ లేఖ రాశారు. మూడు నెల‌ల క‌రెంటు వినియోగాన్ని కలిపి లెక్కించడంతో శ్లాబులు భారీగా మారి.. ప్ర‌జ‌ల‌పై రెండు, మూడింతలు అదనపు భారం పడుతోందని అన్నారు. వంద యూనిట్ల వినియోగదారుడు ప్ర‌స్తుత లెక్కింపు విధానంతో 300 యూనిట్ల శ్లాబులోకి వస్తున్నాడని, ఒక్కో వినియోగదారుడిపై రూ.1500- 2 వేల అదనపు భారం ప‌డుతోంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క‌రెంటు బిల్లుల‌ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తే వడ్డీతో క‌లిపి వసూలు చేస్తామనడం దారుణమ‌న్నారు. అడ్వాన్స్ ఛార్జీలు చెల్లించిన వినియోగదారులకు ప్ర‌భుత్వం వడ్డీ చెల్లిస్తుందా అని ప్ర‌శ్నించారు. పేద, మధ్య తరగతిపై ఒక్క రూపాయి అదనపు భారం పడినా ఉపేక్షించేది లేదని చెప్పారు. తక్షణం నిర్ణయాన్ని పునసమీక్షించుకోవాల‌ని, లేనిపక్షంలో పోరాటం తప్పదని సీఎం కేసీఆర్ ను హెచ్చ‌రించారు.

Latest Updates