క‌రోనాతో కేటీఆర్ ఫ్యామిలీకి కనకవర్షం

కరోనా వైర‌స్, లాక్ డౌన్ ప్ర‌జ‌లంద‌రికీ స‌మ‌స్య‌లు తెస్తే కేటీఆర్ ఫ్యామిలీకి మాత్రం కనకవర్షం కురిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ బావ‌మ‌రిది పాకాల రాజేంద్ర ప్ర‌సాద్ డైరెక్టర్‌గా ఫార్మా కంపెనీకి రూ. 140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. ఆయ‌న డైరెక్టర్‌గా చేరిన ల‌క్సాయ్ లైఫ్ సైన్స్ (LAXAI Life Sciences Pvt. Ltd ) ‌కి కొద్ది రోజులకే వందల కోట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ ఉత్పత్తి కోసం 10వేల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థకు కేంద్రం ఒప్పందం కోసం కేసీఆర్-కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారన్నారు. వేల కోట్ల ఎగుమతులు-లక్షల రూపాయలు టాక్స్ కట్టే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకు కాకుండా అడ్రెస్ లేని సంస్థకు ఎలా వచ్చిందని ప్ర‌శ్నించారు. రాజేంద్రప్రసాద్ సైంసిస్ట్ కాదని, గతంలో ఎలాంటి ఫార్మా అనుభవం లేదని అన్నారు. బావ‌మ‌రిది కోసం కేటీఆర్-కేసీఆర్ రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర పణంగా పెట్టి ఒప్పందం చేయినట్లుగా ఉందని అన్నారు.

“కరొనాను తాత్కాలికంగా హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ అడ్డుకట్ట వేస్తుందని ప్రపంచమంతా నమ్ముతుంది. హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ తయారీ ఎక్కువగా ప్రపంచం మొత్తమ్మీద ఇండియాలోనే ఉంది. హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ తయారీకి కావాల్సిన ముడిసరుకుల కోసం చైనా పై కాకుండా ఇండియాలోనే పూర్తిగా తయారీకి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతటి సంక్షోభంలో మోడీ-కేసీఆర్ ప్రజల కోసం చర్యలు తీసుకుంటున్నారు అనుకున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన సరుకుల కోసం కేసీఆర్.. మోడీ తో మాట్లాడుతున్నారు అనుకున్నాం. కాని దేశంలో, రాష్ట్రంలో దీని వెనుక మ‌రో చీకటి కోణం నడుస్తుంది” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అర్హత లేని కంపెనీలతో ఒప్పందం చేయడం పై బీజేపీ సమాధానం చెప్పాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు. అనుభవం లేని సంస్థతో ఒప్పందం చేసుకుంటే బీజేపీ-టీఆరెస్ అంతర్గత కుమ్మక్కు అయినట్లు అర్థం అవుతుందన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు వ్యాపారం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. బంధుత్వం పేరుతో కేసీఆర్-కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.

“రాష్ట్రానికి కావాల్సిన సహాయం పై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏమైనా లేఖలు రాసిందా? రాస్తే బయటపెట్టాలి? బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన సహకారం ఏంటో చెప్పాలి. అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏం చూసి అర్హత ఇచ్చిందో చెప్పాలి? “అని రేవంత్ కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ విషయం పై ప్రధాని మోడీకి లేఖ రాస్తానని, పార్లమెంట్ లో ప్రశ్నిస్తాన‌న్నారు. టీఆరెస్-బీజేపీ వేరు వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒక్కటేన‌ని బయటకు మాత్రం విమర్శలు చేసుకుంటున్నార‌ని రేవంత్ అన్నారు.
congress mp revanth reddy shocking comments on ktr family over corona virus

Latest Updates