రూ.67 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి రూ.67 వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్న టీఆర్‌ఎస్.. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆస్తులను ఆసరాగా చేసుకొని ప్రచారం చేస్తోందని ఉత్తమ్ దుయ్యబట్టారు. మెట్రో రైలు పిల్లర్‌‌లపై ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తోందని.. ఎల్‌‌ అండ్ టీకి ప్రభుత్వం సాయం చేసిందన్నారు. ఆర్టీసీ ఆస్తులపైనా అడ్వర్టయిజ్‌‌మెంట్‌‌లు పెడుతోందన్నారు. పబ్లిక్ పైసలతో కట్టిన బాత్రూమ్‌‌ల మీద కూడా సర్కార్ పథకాలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

మా నేతలను కొనడానికి బీజేపీకి సిగ్గుండాలి
రాష్ట్రంలో బీజేపీ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. ‘కేంద్రం హైదరాబాద్‌‌కు ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నారు. డబ్బుల సంచులతో కాంగ్రెస్ వాళ్ల ఇండ్లకు వెళ్లి నాయకులను కొనుక్కోవాలని బీజేపీ చూస్తోంది. భూపేందర్ యాదవ్ వేరే పార్టీల నాయకులను కొనుగోలు చేయడానికే రాష్ట్రానికి వచ్చినట్లున్నాడు. మా నాయకుల దగ్గరికి వెళ్ళడానికి బీజేపీ నాయకులకు సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రింగ్ రోడ్డు, మెట్రో రైలు వేశాం. మీరు ఏమేం చేశారో చెప్పండి. కొనుక్కునే రాజకీయాలు మానుకోవాలి. ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉంది. అందుకే బిహార్‌‌లో ఎంఐఎం పోటీ చేసింది. ఓవైసీ సోదరులు అమిత్ షాతో కలసి ఓట్లు చీల్చాలని చూస్తున్నారు. బీజేపీ, ఎంఐఎం రెండూ మతతత్వ పార్టీలే’ అని ఉత్తమ్ కుమార్ వివరించారు.

Latest Updates