పంజాబ్ సీఎంపై సోనియాకు ఎమ్మెల్యేల లేఖ

పంజాబ్ సీఎంపై సోనియాకు ఎమ్మెల్యేల లేఖ

చండీగఢ్: మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం అధిష్టానానికి చికాకుపెడుతున్నట్ల కనిపిస్తోంది. పీసీసీ సారధిగా నవజ్యోత్ సింత్ సిద్ధూను నియమకాన్ని సీఎం అమరీందర్ సింగ్ సహా పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అదిగో.. ఇదిగో అంటూ సిద్ధూ నియాకంపై హై కమాండ్ లీకులిస్తుంటే.. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అదేరీతిలో స్పందిస్తున్నారు. గత కొంత కాలంగా సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ను నవజ్యోత్ సింగ్ సిద్ధూ బాహాటంగా విమర్శించడంతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. 
తనను కాదంటే ఆప్ కు వెళ్లిపోతానని.. సీఎం పదవే ఇచ్చేందుకు రెడీగా ఉందంటూ సిద్దూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పరిస్థితిని గుర్తించిన సోనియా సిద్ధూను బుజ్జగించేందుకు రాహుల్, ప్రియాంకలతో వేర్వేరుగా భేటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సీఎం అమరీందర్ సింగ్ ను కూడా ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించడంతో ఆయన మెట్టుదిగినట్లే కనిపించినా.. సిద్ధూ రాకను వ్యతిరేకించడం మానుకోలేదు. సిద్ధూ నియమాకం ప్రకటన ఏ క్షణంలో వెలువడుతుందన్న సంకేతాలొస్తున్న తరుణంలో సీఎం అమరిందర్ సింగ్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తాజాగా మరో లేఖను సోనియా, రాహుల్ గాంధీలకు రాశారు. 
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసిన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను నిరుత్సాహపరచవద్దని వారు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. ప్రభుత్వం, పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలపై బహిరంగంగా చర్చించడం వల్ల పార్టీ గ్రాఫ్ తగ్గిపోయిందని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  హర్మిందర్ సింగ్ గిల్, ఫతేహ్ బజ్వా, గుర్‌ప్రీత్ సింగ్, కుల్ దీప్ సింగ్ వైద్, బల్వీందర్ సింగ్ లడ్డి, సంతోష్ సింగ్, జోగిందర్ పాల్, జగ్‌దేవ్ సింగ్ కమలు, పిర్మల్ సింగ్ ఖల్సా, సుఖ్‌పాల్ సింగ్ ఖైరా తదితరులు హైకమాండ్ కు రాసిన లేఖపై సంతకాలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఆరు నెలలు మాత్రమే సమయం ఉందని.. ఇలాంటి కీలకతరుణంలో పార్టీని వ్యతిరేక దిశల్లో లాగడం వల్ల విజయావకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. నవజోత్ సింగ్ సిద్ధూ పార్టీకి ఓ సెలబ్రిటీ అని.. ఆయన గొప్ప ఆస్తి వంటి వారంటూ కితాబునిస్తూనే.. సొంత పార్టీ వారినే బహిరంగంగా విమర్శించడం వల్ల పార్టీ కేడర్ లో అంతరాలు ఏర్పడుతున్నాయని.. దీని వల్ల పార్టీ మరింత బలహీనపడే పరిస్థితికి దారితీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.