కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన

కరీంనగర్: వెలుగు: పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ… కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహంచారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ నినాదాలు చేసిన అనంతరం  ఆవరణలోని కొత్తపల్లి తహశీల్దార్ కు మెమెరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనానానికి పెట్రోలు, డీజిల్ ధరల పెంపు వల్ల మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ద్వారా 18 లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. గడిచిన 15 రోజుల్లో 8 రూపాయల రేటు పెంచడం ప్రజలను దోపిడికి గురిచేయడమేనన్నారు. గతంలో బ్యారెల్ 120 డాలర్లున్న చమురు ధర 39 డాలర్లకు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలు ఇంకా పెంచుతూపోతున్నారని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు ఇబ్బందులు తెలియజెప్పేందుకే కాంగ్రెస్ అధ్వర్యంలో అన్ని మండలాల తహసీల్దాలర్లకు మెమోరాండం సమర్పించామన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి కష్టాల్లో ఉన్న పేదలను, సామాన్యులను ఆదుకునేందుకు పెట్రో ధరలు వెంటనే తగ్గించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Latest Updates