అగ్రి చట్టాలపై రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

 

సంగారెడ్డిలో ఆందోళనలో పాల్గొననున్న మాణిక్కం ఠాగూర్

విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. సంగారెడ్డిలో జరిగే నిరసనలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్, ఎంపీ మాణిక్కం ఠాగూర్ పాల్గొంటారని తెలిపింది. అదే రోజు రైతుల సంతకాల సేకరణ ప్రారంభిస్తామని చెప్పింది. ఈ నెల 31 వరకు రైతుల సంతకాల సేకరణ చేసి నవంబర్ 14న  రెండు కోట్ల సంతకాలతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వినతిపత్రం ఇస్తామని తెలిపింది. ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్ ,ఎంపీ ఉత్తమ్ కుమార్ పిలుపునిచ్చారు. మండల , నియోజకవర్గ , జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్లు, గాంధీ విగ్రహల దగ్గర ఉదయం 11 గంటలకు నిరసనల్లో పాల్గొనాలని బుధవారం పత్రిక ప్రకటనలో ఉత్తమ్ సూచించారు.

దేశాన్ని దోచుకుంటున్రు: సచిన్ రావ్

ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో  మోడీ సన్నిహితులైన కార్పొరేట్ వ్యాపారులు దేశాన్ని దోచుకుంటున్నారని ఏఐసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్ సచిన్ రావ్ ఆరోపించారు. రోజు రోజుకు ప్రజల ఆస్తులు, దేశ సంపద తరిగిపోతుంటే.. మోడీ సన్నిహితులైన గౌతమ్ అదానీ, అంబానీల ఆస్తులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందన్నారు.

Latest Updates