రాహుల్​ ప్లేస్​లో ఎవరు?

congress-president-after-rahul-gandhi

జనరల్​ ఎలక్షన్స్​ ముగిసిపోయి దాదాపు 80 రోజులయ్యాయి. ఓటమికి బాద్యతగా రాహుల్​ గాంధీ ఏఐసీసీ కుర్చీ దిగిపోయికూడా 75రోజులవుతోంది. ఇంతవరకు కాంగ్రెస్​లో ఓటమి ప్రభావం తగ్గలేదు. పార్టీకి నెహ్రూ ఫ్యామిలీ మినహా మరో గత్యంతరం లేదని సీనియర్లంతా ఫిక్సయిపోయారు. రాహుల్​ అడుగు వెనక్కి తీసుకోవడం లేదు. దీంతో శనివారం సీడబ్ల్యుసీ సమావేశం నిర్వహించి, కొత్త చీఫ్​పై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్​ను మోడర్న్​ డెమొక్రటిక్​గా మార్చాలన్న ఎనలిస్టుల మాట ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

జనరల్​ ఎలక్షన్స్​లో కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లే వచ్చాయి. 2014తో పోలిస్తే 8 సీట్లు ఎక్కువ వచ్చినా లోక్​సభలో ప్రతిపక్ష హోదామాత్రం దక్కలేదు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ మే 25న కాంగ్రెస్ చీఫ్ పోస్టుకు రాహుల్​ గాంధీ రాజీనామా చేసేశారు.  ఈ పరిణామం కాంగ్రెస్​లో పెనుదుమారం చెలరేపింది. రాహుల్​ను సీనియర్లు రోజుల తరబడి సముదాయించారు. రాహుల్ వెనక్కి తగ్గలేదు.  ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లీడర్లు పొలిటికల్​ ఈక్వేషన్స్​ వేసుకోవడం మొదలెట్టారు. రాహుల్ లేని కాంగ్రెస్​లో కొనసాగడం తమ పొలిటికల్ కెరీర్​కి మైనస్ అవుతుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు ఎనలిస్టులు చెప్పారు.  ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీలకు ఫిరాయింపులు మొదలయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్రలో కొంతమంది నాయకులు  బెటర్ ఆప్షన్ అనుకున్న పార్టీల్లో చేరిపోయారు. లేటెస్ట్​గా రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా గుడ్ బై కొట్టారు. ఏదో ఒక రోజు రాహుల్ మనసు మార్చుకుంటారన్న ఆశతో ఇన్నాళ్లు కాంగ్రెస్ సీనియర్లు ఎదురుచూశారు. అయితే రాహుల్ నుంచి ఎలాంటి హింట్ రాలేదు. మరింత జాప్యం చేస్తే అసలుకే ఎసరు వస్తుందని శశి థరూర్ వంటి లీడర్ల చొరవతో ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది పార్టీ వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అత్యున్నత వేదిక.

దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్త కావు. 1977 ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడిన కాంగ్రెస్… ఆ తర్వాత ఫీనిక్స్ పక్షిలా మళ్లీ జీవం పోసుకుని ఎగిరింది. సముద్రపు అలలా ఎగసి పడటం, మళ్లీ మళ్లీ లేవడం కాంగ్రెస్​కి అలవాటే. లోక్​సభ ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన రాహుల్ రాజీనామా చేయడం చూస్తే… కాంగ్రెస్ కల్చర్​కి ఆయన పూర్తిగా అలవాటు పడలేదేమోనన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ఈ సంగతి ఎలాగున్నా  రాహుల్ రాజీనామా చేసి రెండున్నర నెలలైపోయింది. కాబట్టి, పార్టీ పెద్దలంతా ఏకాభిప్రాయంతో ఏఐసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సింది.

నెహ్రూ ఫ్యామిలీతోనే ఐడెంటిటీ

నెహ్రూ కుటుంబంతో సంబంధం లేనివారు కాంగ్రెస్ చీఫ్​లుగా కొనసాగిన సందర్బాలు చాలా తక్కువ. సామాన్యుల దృష్టిలో కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబ పార్టీయే. ఇందిర, రాజీవ్​, సోనియా, రాహుల్​ ఇలా  ఎవరో ఒకరు ఆ ఫ్యామిలీ నుంచే కాంగ్రెస్ ప్రెసిడెంట్​గా ఉంటారన్నది ప్రజల అభిప్రాయం. కుటుంబ పాలనపై ఎవరెన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలన్నీ నెహ్రూ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతుంటాయి. నెహ్రూ కుటుంబానికున్న గుడ్ విల్ తమ పొలిటికల్​ లైఫ్​కి ఓ సేఫ్ గార్డులా పనిచేస్తుందని కాంగ్రెస్ లీడర్లు బాగా నమ్ముతారు. నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐదో తరం ప్రతినిధి రాహుల్. కాంగ్రెస్​లో నాయకులకు కొదవ లేదుగానీ, బయటి వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే ప్రజలు ఆదరిస్తారా లేదా అనే సందేహం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. ఓట్లు రాబట్టగలిగే  కరిష్మా నెహ్రూ ఫ్యామిలీకి కాకుండా ఎవరికి ఉందన్నది   ప్రశ్నగా మారింది.

పార్టీకి టెంపరరీ ప్రెసిడెంట్?

పార్టీ నాయకత్వం అప్పగింత విషయంలో సీనియర్లు, జూనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సరే సరి.  లేకపోతే పార్టీ తేరుకునే వరకు ఒక ఏడాదిపాటు ఎవరినైనా తాత్కాలిక ప్రెసిడెంట్​గా నియమించవచ్చనే ప్రతిపాదన కూడా వినిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీలకు ఆరు నెల్లలోగా ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్​సభ ఎన్నికల్లో విజయంతో బీజేపీ ఇప్పటికే పుల్​ జోష్​లో ఉంది. ఎంతోకాలంగా నలుగుతున్న కాశ్మీర్​ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. పార్లమెంట్​ రెండు సభల్లోనూ ఆర్టికల్​ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్​ రాష్ట్ర విభజన, పీఎంకే స్వాధీనానికి సన్నాహం వంటి ప్రకటనలతో బీజేపీ వీరవిహారం చేస్తోంది. ‘ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీని సమర్థవంతంగా నడిపించాలంటే కేవలం లీడర్​షిప్​ క్వాలిటీస్​ ఉంటే చాలదు. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. వారితో సమంగా అడుగులేస్తూ ఉత్సాహపరిచే యువ నాయకత్వం రావాలి’ అంటున్నారు విశ్లేషకులు. పార్టీ చీఫ్​గా ఎవరు ఎన్నికైనా  శ్రేణులను ఎన్నికల సమరానికి తయారు చేయాల్సిన బాధ్యత ఉంటుంది.

పార్టీ చీఫ్ కరిష్మా  చుట్టూనే  కాంగ్రెస్ రాజకీయాలు

కాంగ్రెస్ లో  ఐడియాలజీ ని పార్టీ చీఫ్ కరిష్మా డామినేట్ చేయడం మొదలై చాలా కాలమైంది. ఒకప్పుడు పార్టీలో  సీడబ్ల్యుసీ  చాలా బలమైన వేదికలా ఉండేది. నెహ్రూ హయాంలో ఆయన విధానాలను విమర్శించే వారికి కూడా అందులో చోటుండేది. 1967 నుంచి ఈ పరిస్థితి మారింది. 1967 లో ఇందిర అనుకూల వర్గంగానూ, వ్యతిరేక వర్గంగానూ కాంగ్రెస్ చీలిపోయింది. ఈ ప్రభావం వర్కింగ్ కమిటీ పై కూడా పడిందన్నారు ఎనలిస్టులు. ఇందిర విధానాలను విమర్శించేవారు సీడబ్ల్యుసీ దరిదాపుల్లోకి  కూడా రాలేని పరిస్థితి వచ్చింది. 1972 తర్వాత కాంగ్రెస్ లో పరిస్థితులు మరింతగా దిగజారాయి. పార్టీల్లో  ‘ సెలెక్షన్ కల్చర్ ’ పెరిగింది. సంస్థాగత వ్యవహారాల్లో ‘ ఎలెక్షన్స్ ’ పద్దతి అటకెక్కింది. ముఖ్యమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్ గా ఎవరు ఉండాలో పార్టీ హై కమాండే సీల్డ్ కవర్ లో డిసైడ్ చేసే పరిస్థితులు వచ్చాయి.

రేసులో ఉన్న లీడర్లెవరు

కాంగ్రెస్ కొత్త చీఫ్ పోస్టు కోసం ఆ పార్టీలోనే రెండు వర్గాలు గట్టిగా పోటీ పడుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ కథనం.  సోనియా విధేయులుగా ముద్రపడ్డ సీనియర్లు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ , అశోక్ గెహ్లాట్, ఊమెన్ చాందీ,తరుణ్ గొగోయ్, ఆనంద్ శర్మ, మల్లికార్జున్ ఖర్గే పేర్లు ఈ టీం నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే యువతరానికి ఓ అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. యూత్ కోటా కింద జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలెట్, మిలింద్ దేవరా, అజయ్ మాకెన్ పేర్లు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, నెహ్రూ ఫ్యామిలీ నుంచి ప్రియాంక గాంధీ ఇప్పటికే ఏఐసీసీ జనరల్ సెక్రెటరీగా ఉన్నారు. అందుకే ‘ ప్రియాంక లావో దేశ్ బచావో ’ అంటూ కాంగ్రెస్​ లీడర్లు పార్టీలో హల్ చల్ చేస్తున్నారు. ప్రియాంక మొన్నటి జనరల్​ ఎలక్షన్స్​లో యూపీలో పూర్వాంచల్​కి పార్టీ ఇన్​చార్జిగా వ్యవహరించారు. యూపీలోని మొత్తం 80 సీట్లలోనూ కాంగ్రెస్​ గెలిచిందే ఒక్క సీటు. దీంతో పార్టీని  నడిపించగల సత్తా ప్రియాంకకు లేదంటున్నారు ఎనలిస్టులు.

కాంగ్రెస్  కల్చర్ మారదా?

‘డైనస్టీ పాలిటిక్స్’ అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది కాంగ్రెస్ పార్టీనే. గడచిన నలభై ఏళ్లలో పి.వి.నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారిని మినహాయిస్తే నెహ్రూ కుటుంబీకుల పెత్తనమే కొనసాగింది. కాంగ్రెస్​లో ప్రస్తుత పరిస్థితులకు ఈ డైనస్టీ పాలిటిక్సే ప్రధాన కారణమంటున్నారు ఎనలిస్టులు.  కాంగ్రెస్​ వారసత్వ రాజకీయాలపై బీజేపీ పదే పదే దాడికి దిగుతోంది. కాబట్టి, ఇప్పటికైనా కాంగ్రెస్​ని  మోడర్న్  డెమోక్రటిక్ పార్టీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశానికి స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్లతో ఐడియాలజీతో పోరాడిన పార్టీగా కాంగ్రెస్​ని చెబుతుంటారు. కాలక్రమంలో ఐడియాలజీ అటకెక్కి, వ్యక్తి పూజ పెరిగింది.  కోటరీ దగ్గరే అధికారం అంతా సెంట్రలైజ్ కావడం మొదలైంది. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ కలెక్టివ్ లీడర్​షిప్​ని పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది.  టోటల్​గా కాంగ్రెస్ కల్చర్​ని మార్చాలంటున్నారు.

Latest Updates