కరెంటు బిల్లులపై కాంగ్రెస్ నిరసన

లాక్ డౌన్ లో వచ్చిన బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని పట్టణ, మండల కేంద్రాల్లోని కరెంట్ ఆఫీస్ ల ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కోవిడ్ నిబంధనల మేరకు సామాజిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో టీపీపీఎస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్ల బ్యాడ్జీ ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కరెంట్ బిల్లుల నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ వల్ల పేదలు అనేక కష్టాలు పడుతున్నారని.. వారి పరిస్థితులను గుర్తించి పేదల కరెంట్ బిల్లుల ను ప్రభుత్వమే భరించాలని కోరారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న టైమ్ లో కెసిఆర్ ప్రభుత్వం కరెంట్ బిల్లులు మూడింతలు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా  కరెంట్ బిల్లులు వచ్చాయి..  స్లాబ్ లని మించి బిల్లులు వేశారు..  లాక్ డౌన్ తో కష్టాల్లో ఉన్న ప్రజలు కరెంట్ బిల్లులు ఎలా కడతారు…? ఇది దుర్మార్గం..  అని ఆయన పేర్కొన్నారు.  లాక్ డౌన్ టైమ్ లో చిన్న చిన్న వ్యాపారస్తులకు  వ్యాపారమే లేదు.. షాపులన్నీ చాలా కాలంమూసివేయడం వల్ల దెబ్బతిని నష్టపోయారు..  వీళ్ళ కరెంట్ బిల్లులను కూడా ప్రభుత్వమే భరించాలి.. గతంలో ఉన్న టెలిస్కోప్ విధానమే అమలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Latest Updates