అద్నాన్ సమీకి పద్మశ్రీ ఎలా ఇస్తారన్న కాంగ్రెస్

    అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం

    పాక్ పైలట్ కొడుక్కి అవార్డు ఎలా ఇస్తరు?: కాంగ్రెస్

    130 కోట్ల ఇండియన్లకు అవమానం: ఎన్సీపీ

ముంబై: పాకిస్తాన్​ మూలాలున్న సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగుతోంది. అవార్డు ఇవ్వడాన్ని అధి కార బీజేపీ, ఎల్జేపీ సమర్థించుకుంటుండగా, కాంగ్రెస్, ఎన్సీపీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్​కు చెందిన 46 ఏళ్ల అద్నాన్ 2016లో ఇండియా పౌరసత్వం తీసుకున్నారు. ఆయన మ్యూజిక్ కంపోజర్, సింగర్. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఎన్నో హిట్ పాటలు పాడారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ ఎయిర్​ఫోర్స్ పైలట్​గా పని చేశారు. 1965 ఇండియా, పాకిస్తాన్ యుద్ధంలో పాక్ తరఫున పోరాడారు. దీంతో సమీకి పద్మశ్రీ ఇవ్వడంపై వివాదం రేగింది.

అత్యంత అర్హుడు: బీజేపీ

పద్మశ్రీ పురస్కారానికి సమీ అత్యంత అర్హుడని అధికార బీజేపీ, ఎల్జేపీ కామెంట్ చేశాయి. సమీ తండ్రి గురించి విమర్శలు చేయడంపై బీజేపీ స్పోక్స్ పర్సన్ సంబిత్ పాత్రా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తండ్రి గురించి ప్రస్తావించారు. నియంతలు ముస్సోలినీ, హిట్లర్ లతో సోనియా తండ్రికి సంబంధం ఉందని ఆరోపించారు. మరి సోనియాకు ఇండియా సిటిజన్​షిప్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సమీ తల్లి స్వస్థలం జమ్మూ అని చెప్పారు. జమ్మూ ప్రాంతం నుంచి వచ్చిన ముస్లింలను కాంగ్రెస్ పార్టీ గౌరవించదా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్మీ, సుప్రీంకోర్టు, దేశ ప్రజాస్వామ్యాన్ని విమర్శించే వారినే ప్రతిపక్షాలు ఇష్టపడుతాయని పాత్రా ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు దేశద్రోహులను అంగీకరిస్తారని, మంచి ముస్లింలను దూరం చేస్తారని అన్నారు.

జై మోడీ అంటే చాలు: ఎన్సీపీ

సమీకి పద్మశ్రీ ఇవ్వడం 130 కోట్ల మందికి అవమానమని ఎన్సీపీ విమర్శించింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్​పై ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటున్న ఎన్డీయే ప్రభుత్వం.. డ్యామేజీ కంట్రోల్ చర్యల్లో భాగంగా ఆయనకు అవార్డు ఇచ్చిందని ఆరోపించింది. ‘జై మోడీ’ అంటే పాక్ పౌరుడికి కూడా మన సిటిజన్​షిప్ ఇస్తారని ఎన్సీపీ స్పోక్స్ పర్సన్ నవాబ్ మాలిక్ ఎగతాళి చేశారు.

సమీ కౌంటర్

తన తండ్రి పాక్ ఎయిర్​ఫోర్స్ పైలట్ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ గుర్తుచేయడంపై అద్నాన్ సమీ కౌంటర్ ఇచ్చారు. ‘‘హేయ్ కిడ్.. నీ మెదడును క్లియరెన్స్​సేల్​లో కొన్నావా ఏంటి? లేక సెకెండ్ హ్యాండ్ స్టోర్​లో కొన్నావా? తల్లిదండ్రులు చేసిన చర్యలకు పిల్లలు ఎలా బాధ్యులు అవుతారు? స్కూల్​లో మీకు ఇదే నేర్పారా?” అని ట్వీట్ చేశారు. సోమవారం షెర్గిల్, సమీ మధ్య ట్వీట్ల వార్ నడిచింది.

బీజేపీది ఫేక్ నేషనలిజం: కాంగ్రెస్

బీజేపీది ఫేక్ నేషనలిజం అని, 1965 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ సోల్జర్లను అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘అద్నాన్ సమీకి అవార్డు ఇవ్వడాన్ని సమర్థించుకునేందుకు బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం.. వారి ఫేక్, సూడో నేషనలిజాన్ని బహిర్గతం చేస్తోంది. మాజీ రాష్ర్టపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబాన్ని ఫారినర్స్​గా ప్రకటించినప్పుడు.. ఆయన దేశానికి చేసిన కృషిని వివరిస్తూ బీజేపీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ‘సన్ ఆఫ్ సాయిల్’ మహ్మద్ సనావుల్లాను విదేశీయుడిగా ప్రకటించినప్పుడు.. ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు?” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ప్రశ్నించారు. కానీ పాక్ ఎయిర్​ఫోర్స్ అధికారి కొడుకుకు పద్మశ్రీ ఇచ్చినప్పుడు మాత్రం.. అతడికి అనుకూలంగా మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని విమర్శించారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి

Latest Updates