రాహుల్‌ వలస కార్మికులతో మాట్లాడిన వీడియో రిలీజ్‌

  • 17 నిమిషాల వీడియోను పోస్ట్‌ చేసిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఈ నెల 16న ఢిల్లీలోని సుఖ్‌దేశ్‌ ఫ్లైఓవర్‌‌ దగ్గర వలస కార్మికులతో మాట్లాడిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ శనివారం రిలీజ్‌ చేసింది. 17 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రాహుల్‌ గాంధీ ఫుట్‌పాత్‌పై కూర్చొని వలస కార్మికులతో మాట్లాడుతున్న విజువల్స్‌ ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఢిల్లీ నుంచి అంబాలా, ఉత్తర్‌‌ప్రదేశ్‌కు నడిచి వెళ్తున్న కార్మికులను రాహుల్‌ గాంధీ కలిశారు. దాదాపు గంటసేపు వాళ్లతో మాట్లాడారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సాయంతో వాళ్లకు ట్రాన్స్‌పోర్ట్‌ ఏర్పాటు చేసి సొంతూళ్లకు వెళ్లేలా సాయం చేశారు. వలస కూలీలందరికీ స్క్రీనింగ్‌ చేయించి 21 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని లోకల్‌ లీడర్లకు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ వల్ల అందరూ చాలా ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని వీడియో స్టార్ట్‌ అయ్యే ముందు రాహుల్‌ గాంధీ చెప్పారు. “ ఎంత కష్టమైనా వాళ్లు ఆగిపోలేదు. పట్టుదలతో ఇళ్లకు చేరుకునేందుకు కష్టపడుతున్నారు. వాళ్ల ఆలోచన, భయాలు, కలలు, ఆంక్షలు, వారి భవిష్యత్తు గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను” అని రాహుల్‌ గాంధీ అన్నారు. వలస కూలీలు తమ బాధను రాహుల్‌కు చెప్పుకుంటున్న విజువల్స్‌ను కూడా ఉంచారు. చివరగా రాహుల్‌ గాంధీ సందేశంతో వీడియోను ముగించారు. “ నా సోదరులారా మీరు ఈ దేశానికి బలం, ఈ దేశాన్ని మీ భుజాలపై మోస్తున్నారు. మీకు న్యాయం జరగాలని దేశం మొత్తం కోరుకుంటుంది. దేశ బలాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దటం మా కర్తవ్యం” అంటూ వీడియోను ముగించారు.

Latest Updates