కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ త్యాగి ఆకస్మిక మృతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి బుధవారం ఆకస్మికంగా కన్నుమూశారు. ఒంట్లో నలతగా ఉండి అకస్మాత్తుగా కూలపడటంతో త్యాగిని ఘజియాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. ఆయన హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. త్యాగి ఆకస్మిక నిష్క్రమణపై బాధను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌‌ హ్యాండిల్‌లో ఓ పోస్ట్‌ను ట్వీట్ చేసింది.

‘రాజీవ్ త్యాగి ఆకస్మిక మరణంతో మేం చాలా దిగులుకు లోనయ్యాం. ఆయనో దృఢమైన కాంగ్రెస్‌వాది. నిజమైన దేశభక్తుడు. ఈ శోక సమయంలో ఆయన కుటుంబీకులు, మిత్రులతో మా ఆలోచనలు, ప్రార్థనలు ఉంటాయి’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

త్యాగి మరణంపై బీజేపీ లీడర్ సంబిత్ పాత్రా విస్మయం వ్యక్తం చేశారు. ఇది నమ్మశక్యం కానిదని పాత్రా చెప్పారు. ‘ఈ రోజు 5 గంటలకు ఆజ్‌తక్ చానల్‌లో డిబేట్‌లో మేం అందరం పాల్గొన్నాం. జీవితం అంచనాలకు అందనిది’ అని పాత్రా ట్వీట్ చేశారు.

Latest Updates