చైనా ఆక్రమణను ప్రధాని మోడీ బహిరంగంగా ఖండించాలి

న్యూఢిల్లీ: లడఖ్‌లో చైనాతో రాజుకున్న సరిహద్దు వివాదంపై ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరోమారు ఆయనపై విరుచుకుపడింది. చైనా ఆక్రమణను మోడీ బహిరంగంగా ఖండించాలని కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ‘లడఖ్‌లో చైనా ఆక్రమణకు పాల్పడటాన్ని ప్రధాని మోడీ బహిరంగంగా, ప్రజల ఎదుట ఖండించాలి. చైనా తీరును ప్రధాని ఖండించాలని నేను కోరుకుంటున్నా. మేం ప్రభుత్వానికి మద్దుతుగా నిలుస్తాం. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ఇండియా భూభాగంలోకి ఎవరూ ఆక్రమణలకు పాల్పడలేదని, ఇండియా పోస్టులను ఆక్రమించలేదని చెప్పారు. ప్రధాని మాట్లాడాక ఎటువంటి ప్రశ్నలూ ఉత్పన్నం కాకూడదు. కానీ, ఆయన ఎందుకు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారో అర్థం కావడం లేదు. దేశ సమగ్రతను తాను కాపాడలేకపోయానని ప్రజలు భావిస్తారని భయపడి అలా మాట్లాడి ఉంటారా? గ్రౌండ్ ఫ్యాక్ట్స్‌తో పోల్చి చూస్తే ప్రధాని మాటలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. డెప్సాంగ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ద్వారా ఇండియా భూభాగంలో 18 కిలో మీటర్లను చైనా ఆక్రమించింది. చైనీయులు డీబీవో ఎయిర్‌‌స్ట్రిప్‌కు కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఉన్నారు’ అని కపిల్ సిబల్ చెప్పారు.

Latest Updates