కశ్మీర్ స్థానిక ఎన్నికలు: బాయ్ కాట్ చేస్తున్న కాంగ్రెస్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ లో జరుగుతున్న తొలి ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తోంది. జమ్ము కశ్మీర్ స్థానిక ఎన్నికల్ని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు బుధవారం ఆ పార్టీ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత గృహ నిర్బందంలో పెట్టిన నాయకుల్ని ఇంకా విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అక్టోబరు 24న జమ్ము కశ్మీర్ బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (బీడీసీ) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఈసీ ఏర్పాటు చేస్తోంది. అయితే ఇప్పటికీ కొన్ని పార్టీల నేతలు ఇంకా గృహ నిర్భందంలోనే ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్నా రాజకీయ నేతల్ని ఇలా బంధించం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

ఒక పార్టీ గెలుపు కోసమే ఈ ఎన్నికలు

కేవలం ఒక పార్టీ గెలుపు కోసమే ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారని జమ్ము, కశ్మీర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికలు పెట్టే ముందు అన్ని పార్టీల నేతలతో ఈసీ మాట్లాడాల్సిందని అన్నారు.

కొన్ని పార్టీల నేతలన్ని గృహ నిర్భందంలో పెట్టి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనికి నిరసనగా తాము బీడీసీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ఒక పార్టీ (బీజేపీ) ని గెలిపించడం కోసమే జరుగుతున్నాయని, తమ పార్టీల నేతలకు కనీసం భద్రత కూడా కల్పించడం లేదని ఆరోపించారాయన.

దశల వారీగా విడుదల

ఇదిలా ఉండగా, జమ్ములో గృహ నిర్భందంలో ఉంచిన రాజకీయ నేతలందర్నీ ఇటీవలే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కశ్మీర్లోని నేతలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు. వారిని దశల వారీగా ఒక్కొక్కరినీ రిలీజ్ చేస్తామని ప్రకటించింది.

Latest Updates