ప్రజలు నిలబెట్టారు..నిలబడుతరా?

congressbjp-who-is-opposition-party-in-telangana

లోక్‌సభ ఎన్నికల్లో జనం ప్రతిపక్ష పార్టీలను నమ్మారు. వాళ్లకు ఓటేసి నిలబెట్టారు. కాంగ్రెస్‌లో ముగ్గురికి, బీజేపీలో నలుగురికి పట్టం గట్టారు. 16 సీట్లు తమవే అనుకున్న టీఆర్‌ఎస్‌ను తొమ్మిదికి పరిమితం చేశారు. గత టర్మ్‌ కన్నా సీట్లు తగ్గించారు. బలమైన ప్రతిపక్షం ఉంటే తమ గొంతు వినిపిస్తారని ఆశించి ఏడుగురు నేతల్ని ఎన్నుకున్నారు. మరి ఆ రెండు పార్టీలు ఆ నమ్మకాన్ని నిలబెడుతాయా? టీఆర్‌ఎస్‌ను ఢీ కొంటాయా? బలమైన ప్రతిపక్షాలుగా ఎదుగుతాయా? రాష్ట్రంలో మెయిన్‌ అపోజిషన్‌ పార్టీ ఏదవుతుంది? అంతర్గత కుమ్ములాటలను ఆపి జనం పక్షాన ఎవరు నిలబడుతారు? ఓటరు మాటను నెగ్గించేదెవరు? ఇప్పుడు రాష్ట్రాన్ని తొలుస్తున్న ప్రశ్నలివీ!

కాంగ్రెస్‌లో సయోధ్య సమస్య

కాంగ్రెస్‌ జాతీయ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉంది. దిగ్గజ లీడర్లున్నారు. ఊరూరా బలమైన కేడర్‌ ఉంది. అలాంటి పార్టీ 2014, 2018 అసెంబ్లీ ఎలక్షన్‌లో చతికిలబడింది. 2014లో 22 సీట్లు, 2018లో 19 సీట్లతో సరిపెట్టుకుంది. మొన్న గెలుపొందిన వారిలో 11 మంది పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ కుదేలైపోయింది.

లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ పెద్ద ప్రభావాన్ని చూపదని అంతా భావించారు. చివరకు పార్టీ అగ్ర నేతలు కూడా తమకు ఒకట్రెండు సీట్లు మాత్రమే వస్తాయని వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకున్నారు. కానీ ఫలితాలు చూశాక వారే ఆశ్చర్యపోయారు. మూడు స్థానాల్లో నెగ్గిన ఆ పార్టీ మరో మూడు సీట్లలో బలమైన పోటీ ఇచ్చింది. ఓటు శాతాన్ని కూడా పెంచుకుంది. ఈ ఫలితాలను విశ్లేషించుకున్న నాయకులు.. ప్రశ్నించే గొంతుకలుగా ఉండాలని ప్రజలు తమను గెలిపించారని అర్థం చేసుకున్నారు. ఈ విషయాన్నే ఓపెన్‌గా ప్రకటించారు.

నల్గొండ నుంచి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భువనగిరి నుంచి మాజీ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి గెలిచారు. ఈ ముగ్గురు ఉద్దండులే. ఎవరి గ్రూప్‌ వాళ్లకు ఉంది. ముగ్గురూ టీఆర్‌ఎస్‌ని చెరిగేసే వారే. వీళ్లు కలిసికట్టుగా నడుస్తారా, ఎవరి దారి వారిదేనా అన్న సందేహం ఆ పార్టీ కేడర్‌లో ఉంది. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు సహజం. లీడర్లు బహిరంగంగానే విమర్శించుకుంటారు. గతంలో ఇవి మామూలు విషయాలుగా ఉండేవి. కానీ ఈ ఎన్నికల్లో విజయం తర్వాత వీటిని జనం సహించే పరిస్థితి ఉండదు. నాయకుల్లో ఐక్యత లేదన్న భావన వారిలో ఏర్పడుతుంది. ఏకతాటిపై నడిపే లీడర్‌ లేడనే అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్‌ నేతలను గెలిపించిన నేపథ్యంలో లీడర్లు ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకొని ఐకమత్యం చాటుతారా  లేదా అన్నది ఎదురు చూడాల్సిందే. జనం నాడిని తెలుసుకొని కిందిస్థాయికి వెళ్లి వాళ్ల పక్షం వహిస్తేనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే పరిస్థితి ఉంటుందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మరి ఆ పార్టీ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

కమలం ఊరూరా విస్తరిస్తుందా?

మోడీ హవా, కొన్ని సెగ్మెంట్‌లలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉండడం వంటి కారణాలతో గెలిచిన బీజేపీలోనూ నాయకుల మధ్య కుమ్ములాటలున్నాయి. అయితే అవి బయటపడకపోయినా క్లోజ్‌గా చూసేవారికి బాగానే కనిపిస్తాయి. రాష్ట్ర నేతల్లో ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఇతరుల ఎదుగుదలను ఓర్చుకోకపోవడం లాంటి లక్షణాలు బీజేపీలో ఉన్నాయి. బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననే లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి తమకు ఒక్క సీటొస్తే ఎక్కువనుకుంది బీజేపీ. ఏకంగా నాలుగు గెలవడంతో ఆనందానికి హద్దుల్లేవు. మిగతా 13 చోట్లా సత్తా చాటింది. రెండింట్లోనైతే రెండో స్థానంలో నిలిచింది. ఓటు శాతాన్ని గణనీయంగా 19.5 శాతానికి పెంచుకుంది. కేడర్‌ లేని చోట్లా ఉనికి చాటుకుంది. అనేకచోట్ల పార్టీ నిర్మాణం లేకపోయినా జనం ఆదరించారు. బీజేపీకి దక్కిన ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌ బలంగా లేని చోట్ల బీజేపీ గెలిచింది. అంటే ఓటరు పార్టీని చూడకుండా అపోజిషన్‌ను గెలిపించాలనే ఓటేశాడని అర్థం చేసుకోవచ్చు. మరి బీజేపీ కూడా ఓటరు ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ప్రవర్తిస్తుందా?

సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్‌ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అయితే ఆయనకు, రాష్ట్ర పార్టీ పెద్దలకు మధ్య కొంత గ్యాప్‌ ఉంది. కరీంనగర్‌ నుంచి గెలిచిన బండి సంజయ్‌కి స్థానికంగా కొంత ఇమేజ్‌ ఉంది. కానీ ఇతర ప్రాంతాల వారికి అంతగా తెలియదు. కొందరు రాష్ట్ర నేతలకు ఈయనకు పొసగదని చెప్తారు. నిజామాబాద్‌ నుంచి గెలిచిన అర్వింద్‌ రెండేళ్ల కిందటే పార్టీలో చేరారు. ఆయనకు నిజామాబాద్‌ అర్బన్‌లో తప్ప నియోజకవర్గంలో తప్ప మిగతా చోట్ల పెద్దగా కేడర్‌ లేదు. రైతుల ఆగ్రహమే ఆయన్ను కేసీఆర్‌ కూతురు కవితపై విజయం సాధించేలా చేసింది. ఆదిలాబాద్‌ నుంచి ఎన్నికైన సోయం బాపురావు విజయం బీజేపీకే పెద్ద షాక్‌. ఆయన చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్‌ సాధించారు.

మరి వీరంతా ఈ పరిమితుల నుంచి బయటపడి బలమైన ప్రతిపక్షంగా ఎదిగి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికలకు ముందు డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి లాంటి బలమైన నేతలు కొందరు పార్టీలో చేరారు. మరికొందరు నేతల్ని కూడా ఆ పార్టీ ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వాళ్లు అదే ప్రయత్నంలో ఉన్నారు. బయట పార్టీల నుంచి గట్టి నాయకత్వాన్ని చేర్చుకొని రాష్ట్రంలో బలపడాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఆ నేతల ద్వారానే కేడర్‌ను పెంచుకోవాలనే యోచన కూడా వారిలో ఉంది. ప్రస్తుతం బీజేపీకి 25 నియోజక వర్గాల్లో ఎంతో కొంత కేడర్‌ ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ కార్యకర్తలే వారికి బలం. బీజేపీని కిందిస్థాయిలో ఎలా విస్తరిస్తారన్నదే పెద్ద లీడర్ల ముందున్న సవాల్‌. పార్టీని బలోపేతం చేసుకుంటూ టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలాంటి పోరాటం సాగిస్తారో వేచి చూడాలి. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉండే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వాడుకుంటుందా లేదా అన్నది చూడాల్సిందే.

బీజేపీ ప్లస్

 •    మోడీ వేవ్‌.. జాతీయవాదానికి ఆదరణ
 •    కాంగ్రెస్‌ బలహీనపడడం
 •    టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించడం
 •    ఆర్‌ఎస్‌ఎస్‌ బేస్‌, సపోర్ట్‌ కలిసి రావడం

మైనస్

 •    రాష్ట్రంలో కేవలం 25, 30  సెగ్మెంట్లలోనే కేడర్‌
 •    బలమైన నేతలు తక్కువ మంది ఉండడం
 •    బయట పార్టీల నుంచి వలస వచ్చే నేతలపైనే ఆశ
 •             ఒక వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తుందన్న అపవాదు

కాంగ్రెస్‌ ప్లస్‌

 •    కిందిస్థాయిలో బలమైన క్యాడర్‌
 •    గ్రామగ్రామాన పార్టీ నిర్మాణం
 •    ఆర్థిక, అంగబలం కలిగిన లీడర్లు
 •    పార్టీకి సెక్యులర్‌ ముద్ర

మైనస్

 •    నేతల మధ్య ఐక్యత లేమి
 •    అందరూ ఒప్పుకునే లీడర్​ లేకపోవడం
 •    సమస్యలపై పోరాటానికి స్ట్రాటజీలో అస్పష్టత
 •    మొక్కుబడి ఆందోళనలకే పరిమితం

 

 

Latest Updates