తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం

తెలంగాణ పోలీసు  డిపార్ట్ మెంట్ లో మొదటి  కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న దయాకర్‌ రెడ్డి అనే కానిస్టేబుల్‌ కరోనాతో పోరాడుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. లాక్‌డౌన్‌ విధుల్లో భాగంగా పాతబస్తీలోని ఓ చెక్‌పోస్ట్‌ దగ్గర ఆయన విధులు నిర్వర్తించారు.

అయితే ఆదివారం దయాకర్‌కు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో అతన్ని బేగంపేటలోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతని శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపగా..  సోమవారం కరోనా సోకినట్టుగా నిర్దారణ అయింది. దీంతో దయాకర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనాతో పోరాడుతూ.. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దయాకర్‌ కుటుంబ సభ్యులతోపాటు.. అతనితో కలిసి పనిచేసిన 16 మంది పోలీసుల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. అందులో నలుగురిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించినట్టుగా సమాచారం.

దయాకర్‌ మృతిపట్ల తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు దయాకర్‌ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఆయన అంత్యక్రియలు ఐదురురి సమక్షంలో  నిర్వహించారు.

Latest Updates