కానిస్టేబుల్ మంచి మ‌న‌సు: అంత్య‌క్రియ‌ల‌కు సాయం

చాంద్రాయణగుట్ట , వెలుగు: ‘వారిద్దరూ పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చేరో పని చేసుకుంటూ కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నారు.వాళ్ల‌కో పాప కూడా పుట్టింది. సంతోషంగా ఉంటున్న టైమ్ లో యాక్సిడెంట్ భ‌ర్త‌ను మంచాన పడేసింది. లాక్ డౌన్ లో భార్య ఉపాధి కోల్పోయింది. ఇల్లు గడవడం ఎలాగన్న ఆలోచనతో సతమతమవుతుండగా..ఆమె హార్ట్ స్ట్రోక్ తో చనిపోయింది. అంత్యక్రియలకూ డబ్బుల్లేని పరిస్థితిలో ఓ కానిస్టేబుల్ నిలిచి మానవత్వం చాటుకున్నాడు. మెహిదీపట్నానికి చెందిన ఇషాంత్(38), చంపాపేటకి చెందిన రేఖ(35) పదేండ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సంతోష్ నగర్ లోని మారుతీనగర్లో ఉంటున్నారు. ఇషాంత్ హిమాయత్ నగర్లో మెడికల్షాపులో పని చేసేవాడు. రేఖ క్యాటరింగ్ పనులు చేసేది. వాళ్ల‌కో కూతురు ఆరుషి(5). ఇషాంత్ కు 6 నెలల క్రితం జరిగిన రోడ్ యాక్సిడెంట్లో కాలు విరిగింది.ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

అదే టైమ్ లో లాక్ డౌన్ మొదలవడంతో రేఖకి క్యాటరింగ్ పనులు లేక కుటుంబపోషణ భారంగా మారింది. ఎలాగా అని ఆలోచిస్తున్న క్రమంలోనే.. సోమవారం సాయంత్రం రేఖకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్లోపేలే చనిపోయింది. ఆమె అంత్యక్రియలకు కూడా ఇషాంత్ ద‌గ్గర డబ్బుల్లేవు. కరోనా కావచ్చన్న భయంతో చుట్టు పక్కల వాళ్లు సాయం చేసేందుకూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కంచన్ బాగ్ పోలీసులు వైద్య సిబ్బందితో వచ్చి రేఖది కరోనా మరణం కాదని తేల్చారు. ఇషాంత్ పరిస్థితి తెలుసుకున్న కానిస్టేబుల్ పి.శ్రీనివాస్ చలించి రేఖ అంత్యక్రియల కోసంరూ.10 వేలు సాయం చేశాడు. కాలనీ ప్రెసిడెంట్ సుధాకర్రెడ్డి మరో రూ.4 వేలు ఇవ్వడంతో కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం దోబీఘాట్లో అంత్యక్రియలు జరిపించారు.

Latest Updates