అంబులెన్స్ కు ముందు పరిగెత్తి ట్రాఫిక్ ను క్లియర్ చేసిన కానిస్టేబుల్

ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కు దారి కల్పించి…ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సమయానికి ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడాడు ఓ కానిస్టేబుల్. పరిస్థితి విషమంగా ఉన్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్ మొజంజాహి మార్కెట్ నుండి కోఠి వెళ్లే దారిలో ట్రాఫిక్ లో చిక్కుకు పోయింది.ఎటూ వెళ్లలేని పరిస్థితి. హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసే బాబ్జి.. ఈ విషయాన్ని గమనించి వెంటనే స్పందించాడు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ..అంబులెన్స్ కు ముందు పరిగెత్తుతూ..ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కు దారి కల్పించాడు. దీంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకున్న ఆ వ్యక్తి ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డాడు.

సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ఆ కానిస్టేబుల్ సహాయానికి కృతజ్ఞతగా ఆ వీడియో ను సోషల్ మీడియా లో పెట్టారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Latest Updates