ఫొటో వైరల్: ఫేస్ మాస్క్‌‌గా మెడకు పాము.. ప్రయాణికులు షాక్

లండన్: కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, శానిటైజర్స్ వాడటం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు ఈ నిబంధనలను పాటించడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా రూల్స్‌‌ను పక్కాగా పాటించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. దీంతో ప్రజలు మాస్కులు కట్టుకొని, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ కనిపిస్తున్నారు. అయితే లండన్‌‌లో ఓ వ్యక్తి కరోనా నిబంధనలను వెరైటీగా పాటించడం ఇంటర్ నెట్‌‌లో వైరల్‌‌గా మారింది. మాంచెస్టర్‌‌లో ఒక బస్సులో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి ముఖానికి మాస్కుకు బదులు పామును చుట్టుకోవడం అందర్నీఆశ్చర్యానికి గురి చేసింది. మెడతోపాటు నోరు కూడా కవర్ అయ్యేలా అతడు పామును చుట్టుకున్నాడు. మొదట ఆ వ్యక్తిని చూసిన సహచర ప్రయాణికులు అతడి ముఖంపై కలర్ ఫుల్ మాస్క్ వేసుకున్నాడని భావించారు. తర్వాత పాముగా గుర్తించి షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను క్రిస్ చాంబర్స్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. మాంచెస్టర్‌‌లో పామును ఫేస్ మాస్కుగా ధరించిన వ్యక్తి అంటూ సదరు పోస్ట్‌‌కు క్రిస్ క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటో ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న బ్రిటన్ ప్రభుత్వం ముఖాన్ని కవర్ చేసుకునే విషయంలో నిబంధనలపై స్పష్టతను ఇచ్చింది.

Latest Updates