రూ.11వేల కోట్లతో డ్రాగన్ ద్వీపం నిర్మాణం

construction-of-dragon-island-with-rs-11000-crore

వేల్స్‌‌లో ఉన్న స్వాన్‌‌సీ దగ్గరి సముద్రంలో ఓ కృత్రిమ దీవిని కడుతున్నారు. కడుతున్నారంటే అట్లా ఇట్లా కాదు. పై నుంచి చూస్తే వేల్స్‌‌ జాతీయ జెండాపై ఉన్న డ్రాగన్‌‌ ఆకారంలో కనబడుతుందట. వేల్స్‌‌ రివైజ్డ్‌‌ టైడల్‌‌ లాగూన్‌‌ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.11 వేల కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును చేపడుతున్నారు. హాంకాంగ్‌‌కు చెందిన ఎంవోఐ ఇమాజినీరింగ్‌‌ సంస్థ హెడ్‌‌ మాల్కమ్‌‌ కాప్సన్‌‌ దీని సృష్టికర్త. దీవిలో 10 వేల ఇళ్లను కడుతున్నారు. అవన్నీ నీటిపై తేలేలా (ఫ్లోటింగ్‌‌ హోమ్స్‌‌) డిజైన్‌‌ చేస్తున్నారు. దీవి కింద నీటిలో టర్బైన్లు ఉంటాయని, వీటితో కరెంటును ఉత్పత్తి చేస్తామని అంటున్నారు. ఇలా ఈ దీవి వందేళ్లకు పైగా స్వాన్‌‌సీ నగరానికి కరెంటునిస్తుందని, దీనికి బ్రిటన్​  ఆర్థిక సాయం కూడా అవసరం లేదని చెబుతున్నారు. ఈ ద్వీపం నుంచి విద్యుత్‌‌ను పబ్లిక్‌‌ సెక్టార్‌‌ ఆర్గనైజేషన్లు, వేరే ఎవరైనా కొనుక్కోవచ్చని వివరిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఊహా చిత్రాలను విడుదల చేశారు. సోలార్‌‌ ఫామ్​లు, అండర్‌‌ వాటర్‌‌ డేటా సెంటర్‌‌, హైడ్రోజన్‌‌, ఆక్సిజన్‌‌ ఉత్పత్తి చేసే సెంటర్లు అందులో ఉన్నాయి.  ఇంతకుముందు కూడా ఇలాంటి దీవి, టైడల్‌‌ లాగూన్‌‌ ప్రతిపాదననే తీసుకొచ్చినా వెస్ట్‌‌ మినిస్టర్‌‌ ప్రభుత్వం తిరస్కరించింది. నిర్వహణ వ్యయం చాలా ఎక్కువవుతుందని వెనక్కు తగ్గింది. కానీ తాజా ప్రాజెక్టుతో తక్కువ ఖర్చుకే ఎక్కువ కరెంటును ఉత్పత్తి చేయనున్నారు.

ఔరా! అనేలా

ఇలాంటి ఫ్లోటింగ్‌‌ ప్రాజెక్టులు హాలాండ్‌‌ సహా చాలా ప్రాంతాల్లో ఉన్నాయని కాప్సన్‌‌ చెప్పారు. అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌‌ లాంటి ప్రాంతాల్లో ఇంకా పట్టాలెక్కలేదన్నారు. స్వాన్‌‌సీ ప్రాజెక్టును ప్రపంచమంతా ఔరా! అనేలా నిర్మిస్తామని చెప్పారు. నీటిపై తేలాడే ఇళ్లను చుట్టూ ఉండే సీవాల్‌‌ కాపాడుతుందన్నారు. చెత్త రీసైక్లింగ్​కూ ఇక్కడ ప్లాంట్లు ఉన్నాయని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం 2021లో మొదలవుతుందని, 2026 నాటికి పూర్తవుతుందని అంటున్నారు.

 

Latest Updates