జబ్బు దాచలేదు..బీమా సొమ్ము ఇవ్వాల్సిందే

బజాజ్ అలియాంజ్ కు కన్జ్యూమర్ ఫోరం ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: పాలసీదారు తనకున్న జబ్బును దాచి, ఇన్సూరెన్స్ తీసుకున్నారంటూ బీమా సొమ్ము ఇవ్వని బజాబ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కంపెనీపై తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్(ఎస్ సీడీఆర్ సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలసీదారు ఆమెకు కేన్సర్ ఉందని తెలియక ముందే పాలసీతీసుకున్నారని, పాలసీ క్లెయిమ్ ను తొమ్మిది శాతం వడ్డీతో తిరిగి చెల్లిం చాలని ఆదేశించింది.

వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన బుర్రా పుష్పనీల 2007లో బజాజ్ అలియాంజ్ కు చెందిన రూ.5 లక్షల లైఫ్ ఇన్సూరె న్స్ పాలసీ తీసుకుం ది. మెదడులో రక్తనాళాలు దెబ్బతి నడం వల్ల పక్షవాతం(సెరెబ్రో వాస్క్యూలర్‌ డిసీస్‌ విత్‌ హెమిపెరెసిస్‌)తో బాధపడతున్నట్లు ఆమె పాలసీలో పేర్కొం ది. రెండు ప్రీమియంలను సకాలంలోనే చెల్లిం చారు. 2008 ఏప్రిల్ 10వ తేదీన పుష్పనీల అనారోగ్యానికి గురైంది. కాజీపేటలోని సెయింట్ ఆన్స్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంది.క్యాన్సర్ అని తేల్చిన డాక్టర్లు , మందులు రాసిచ్చారు. 2009 మే 14న ఆమె చనిపోయింది. మృతురాలి భర్త బుర్రా చేరాలు, కుమారులు బజాజ్ అలియాంజ్ కు బీమా క్లెయిమ్‌ కోసం అప్లై చేశారు. ఆ క్లెయిమ్ ను కంపెనీ తిరస్కరించింది.

దీంతో వారు వరంగల్ జిల్లా కన్జూమర్ ఫోరంను ఆశ్రయిం చారు. క్యాన్సర్ జబ్బు ఉన్నవిషయాన్ని దాచి పాలసీ తీసుకున్నారని, అందువల్లే బీమాను తిరస్కరిం చామని కంపెనీ ప్రతినిధులు వాదించారు. వారితో ఏకీభవించిన ఫోరం కేసును కొట్టేసింది. దీంతో బాధితురాలి కుటుంబం ఎస్ సీడీఆర్ సీను ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కమిషన్ చైర్మన్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ జిల్లా ఫోరం తీర్పును తప్పుపట్టారు. బాధితురాలికి పాలసీ తీసుకునే సమయానికి క్యాన్సర్‌ ఉన్నట్లు తెలియదన్నారు. కాబట్టి ఆమెకు వడ్డీతో సహా బీమా సొమ్ము చెల్లిం చాలని తీర్పు చెప్పారు. కోర్టు ఖర్చుల కింద మరో 5 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు.

Latest Updates