కడపలో కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళన

డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట నిరసన.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

కడప: జిల్లా కేంద్రంలోని డీ ఎం హెచ్ ఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్లు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ స్థానాల్లో ఇతరులను నియమించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలతో ఆందోళనకు దిగిన వీరు అధికారుల తీరుతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించారు. కరోనా డ్యూటీలు వేసేటప్పుడు తిరిగి పూర్వ స్థానాల్లో నియమిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు తీరా కొత్తవారిని నియమించుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ నిరసనకు దిగారు. కోవిడ్ డ్యూటీలు కేటాయించేటప్పుడు, డ్యూటీలు ముగిసిన వెంటనే పూర్వ స్థానాల్లోకి తీసుకుంటామని చెప్పి మాట మార్చుతున్నారని ఆరోపించారు. కొత్తవారిని నియమించుకునేందుకు హుటాహుటిన నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించిన ల్యాబ్ టెక్నీషియన్ల పై డీ ఎం హెచ్ ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కున్నచోట చెప్పుకొండంటూ ఫైర్.. ఎక్కువ మాట్లాడితే జీతాలు సంబంధించి ట్రెజరీ లింకు ను కట్ చేస్తామని హెచ్చరికలు చేశారు. దీంతో డైరెక్ట్ కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ లు అయోమయంలో పడగా.. కొందరు మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని నివారించారు.

 

Latest Updates