పోలీస్ స్టేషన్లో కాంట్రాక్టర్ బర్త్ డే

కరీంనగర్ క్రైం, వెలుగు : ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటేపోలీసులు ప్రజలకు దగ్గర అయ్యారో లేదో తెలియదుకాని కాంట్రాక్టర్లకు మాత్రం బాగానే దగ్గరయ్యారు. ఎంత బాగా దగ్గరయ్యారంటే ఎన్ని కల వేళ విధులు మరిచి పోలీస్ స్టేషన్ లో బర్త్​డే వేడుకలు జరుపుకొనేటంతగా… శనివారం రాత్రి మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ ఇంద్రసేనారెడ్డి.. స్టేషన్లోని తన గదిలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ పుట్టిన రోజు మాత్రం పోలీసులది కాదు.. వీణవంక మండలం గంగారంగ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ది. పోలీస్ స్టేషన్ లో ఓ కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సదరు కాంట్రాక్టర్ ను శాలువాలు, పూలమాలతో సత్కరించి సీఐ ఇంద్రసేనా రెడ్డి.. తన చాంబర్ లో కేక్ కట్ చేయించారు. అయితే ఈ అనుబంధం ఇప్పటిది కాదు.

ఏడాదిన్నర క్రితం ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ కు బదిలీ అయ్యారు. అప్పట్లో విధుల్లో చేరకుండానే… కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి మరికొందరితో కలిసి విందు చేసుకునేందుకు కాళేశ్వరం వెళ్లారు ఇంద్రసేనారెడ్డి. మద్యం మత్తులో కారు బోల్తా పడగా స్థానికులు గమనించి సహాయం చేసేందుకు వచ్చారు. అయితే మద్యం మత్తులో ఉన్నవారంతా స్థానికులతో గొడవకు దిగారు. ఏకంగా సర్వీస్ రివాల్వర్ తో బెదిరించిన ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకోకపోగా సదరు అధికారికి సామాజిక వర్గం కలిసి వచ్చి పదోన్నతితో పాటు తిరిగి అదే మానకొండూర్ స్టేషన్ సీఐగా పోస్టింగ్ ఇచ్చారు.

పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ.. ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతున్న యువకులను రోడ్డుపై విచక్షణరహితంగా కొట్టి హాస్పిటల్ పాలు చేశారు. తాజాగా కాంట్రాక్టర్ బర్త్​డే స్టేషన్​లోనే నిర్వహించి మరోసారి వార్తల్లోకి వచ్చారు సీఐ ఇంద్రసేనా.

 

Latest Updates