సర్కా రు పనులంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నరు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా

వరంగల్ లోనైతే కాళ్లు మొక్కినా వస్తలేరు

చేసిన పనులకు బిల్లులు ఎప్పుడస్తయో తెల్వది

నేను కూడా బిల్లుల కోసం తిరుగుతున్నా

క్వాలిటీ పేరిట 20 శాతం కట్​చేస్తే కాంట్రాక్టర్ బతకాల్నా.. సావాల్నా..

గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కామెంట్​

వరంగల్​, వెలుగు: ప్రభుత్వ పనులు చేస్తే బిల్లులు రావట్లేదని, అసలు గ్రేటర్ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారని, తాను కూడా పనులు చేసి బిల్లుల కోసం తిరుగుతున్నానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్​లో శుక్రవారం నిర్వహించిన గ్రేటర్ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కౌన్సిల్​ మీటింగ్ కు ఆయన హాజరై మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో ఐదేండ్లు గడుస్తున్నా కార్పొరేటర్లు ఏ ఒక్క పనీ పూర్తి చేయలేకపోయారన్నారు. తన పరిధిలోని 2, 3, 4, 5 డివిజన్లలో పనులు టెండర్ అయి రెండేళ్లు దాటుతోందని, కాంట్రాక్టర్లను బతిమాలినా రావడం లేదన్నారు. మున్సిపాలిటీలో పనులు చేయాలంటే కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్టర్లు జేబులోంచి డబ్బు ఖర్చు చేస్తే బిల్లుల చెల్లింపులో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చల్లా మండి పడ్డారు. సీఎం అస్యూరెన్స్ పనులు శాంక్షన్ చేసిన తరువాత ఎక్కడ ఏ పని పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు చేయకపోతే ఎట్లా అని ఇంజినీరింగ్ ఆఫీసర్లను అడిగారు.

‘బిల్లు ల్లో 20శాతం కట్​ చేసి చెల్లిస్తున్నరు.. అసలు కాంట్రాక్టర్ బతకాల్నా చావల్నా చెప్పండి .. క్వాలిటీ మంచిగా లేదని బిల్లు కట్​ చేయడానికి అదేమైనా మీ అయ్య సొమ్మా’ అని ప్రశ్నించారు. పనులు జరుగుతుంటే ఏఈలు, డీఈలు చూస్తారు కాబట్టి క్వాలి టీ విషయంలో వారిపైనా బాధ్యత ఉంటుందన్నారు. కానీ కాంట్రాక్టర్లను మాత్రమే బలి చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. పట్టణ ప్రగతి కోసం వరంగల్​కు వచ్చిన రూ.32 కోట్లు , 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.35 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 10.75 కోట్లు ఖర్చు చేయక మూలుగుతున్నాయని అన్నా రు. జీడబ్ల్యూఎంసీలో ఉన్న రూ.160 కోట్ల జనరల్​ ఫండే ఖర్చు పెట్టడం లేదని, ఇంకా సీఎంఏ ఫండ్ ఎందుకని ముఖ్యమంత్రి అడుగుతున్నారని పేర్కొన్నారు. అసలు అవి ఎందుకు ఖర్చు చేయడం లేదని ఆఫీసర్లను ప్రశ్నించారు. ప్రజలు అవన్నీ చూడరని, పనులు అవుతున్నాయా లేదా అని మాత్రమే చూస్తరని ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్పారు.

Latest Updates