ఎవరికి వారే..కరోనా కట్టడిలో శాఖల మధ్య సమన్వయ లోపం

హైద‌‌రాబాద్‌‌, వెలుగు:గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనాను కంట్రోల్ ​చేయడంలో శాఖల మధ్య కోఆర్డినేషన్ ప్రాబ్లమ్​ కనిపిస్తోంది. జీహెచ్‌‌ఎంసీ, మెడికల్‌‌, పోలీస్​శాఖల తీరు ఎవరికి వారే అన్నట్టుగా సాగుతోంది. కంటెయిన్​మెంట్ల నిర్వహణలోని ఫెయిల్యూర్సే ఇందుకు నిదర్శనం. వైరస్‌‌పై ప్రజలకు అవేర్​నెస్​ కల్పించడంతోపాటు తగు చర్యలు చేపట్టాల్సిన అధికారులు లైట్​ తీసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. గ్రేటర్‌‌లో కేసులు భారీగా పెరుగుతుండగా, కట్టడిపై ఫోకస్ ​చేయడంలో అధికారులు ఫెయిల్​ అవుతున్నారు. పాజిటివ్‌‌ కేసు నమోదైన చోట కంటెయిన్​మెంట్‌‌ జోన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారు. గడువు ముగిశాక ఎత్తేస్తున్నారు. మొన్నటిదాకా ఉన్న కంటెయిన్​మెంట్‌‌ జోన్ల స్వరూపం కాస్త హోం క్వారంటెయిన్​గా మారింది. ఒకటి, రెండు ఇండ్లకు మాత్రమే బారికేడ్లు పెట్టి రాకపోకలు బంద్​పెడుతున్నారు. స్థానికులు బయట తిరుగుతున్నా కంట్రోల్​చేయలేకపోతున్నారు.

ఒకరిపై మరొకరు..

‘‘లాక్‌‌డౌన్‌‌ రూల్స్​ కచ్చితంగా అమలు చేయాల్సిందే. నిర్లక్ష్యంతో ఒక్క కేసు నమోదైనా పరిస్థితిని అదుపు చేయలేం’’ అని ప్రభుత్వం, జీహెచ్‌‌ఎంసీ చెప్తోంది. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం నిర్ణయాలు పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్​అవడం లేదు. లోపాలపై ఫోకస్ ​చేయడం లేదు. ప్రస్తుతం గ్రేటర్‌‌ పరిధిలో 100 వరకు హోమ్‌‌ క్వారంటెయిన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఎక్కడెక్కడున్నాయో కూడా అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. హోం క్వారంటెయిన్​లో ఉన్న వాళ్లు బయట తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఉల్లంఘనలకు బాధ్యత వహించాల్సిన అధికారులు ఒక శాఖపై మరొకరు నెట్టేసుకుంటున్నారు.

ఎవరిది బాధ్యత?

కంటెయిన్​మెంట్‌‌ జోన్లలో కొత్త కేసులు నమోదవడం లేదని, ఆంక్షలు సడలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటి వివరాలు మాత్రం చెప్పడం లేదు. లంగర్​హౌస్​లో హోం క్వారంటెయిన్‌‌లో ఉండాల్సిన వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి ఫ్రెండ్స్​తో మందు పార్టీ చేసుకున్నాడు. కాలనీలోకి వచ్చి న్యూసెన్స్‌‌ చేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అతడిని, అతడి స్నేహితులను క్వారంటెయిన్‌‌కు తరలించారు. ఈ విషయంపై స్థానిక జీహెచ్‌‌ఎంసీ అధికారులు పట్టించుకోలేదు. క్వారంటెయిన్‌‌లోని వ్యక్తులపై పర్యవేక్షణ బాధ్యత తమది కాదని పోలీసులదని అంటున్నారు. వాస్తవానికి, గ్రేటర్‌‌లోని అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసుకుంటూ కరోనాను కంట్రోల్ ​చేయాల్సిన బాధ్యత బల్దియాదేనని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

Latest Updates