మక్కల కొనుగోళ్లలో కొర్రీలు..ఎకరాకు 26.50 క్వింటాళ్ల సేకరణ

మక్కల కొనుగోళ్లలో కొర్రీలు..ఎకరాకు 26.50 క్వింటాళ్ల సేకరణ
  • వాస్తవ దిగుబడి 35 క్వింటాళ్ల పైనే
  • మిగిలిన మక్కలు ప్రైవేట్​లో అమ్మకం
  • క్వింటాల్​కు రూ.650 దాక లాస్
  • సీలింగ్​ ఎత్తేయాలని రైతుల డిమాండ్​

మంచిర్యాల, వెలుగు:ప్రభుత్వం మక్కల కొనుగోళ్లపై ఎకరానికి 26.50 క్వింటాళ్ల సీలింగ్​ విధించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఈ సీజన్​లో ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైతులు తాము పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి సెంటర్లకు తరలిస్తున్నారు.

సీలింగ్​ కారణంగా వారికి చుక్కెదురవుతోంది. ఎకరానికి 26.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో మిగులు పంటను ప్రైవేట్​ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.2,400 కాగా, వ్యాపారులు రూ.1,750 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.650 దాక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్రంగా నష్టపోతున్న రైతులు

మంచిర్యాల జిల్లాలో ఈ సీజన్​లో 7వేల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేశారు. సాధారణంగా ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున 2.10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ అధికారులు అంచనా వేశారు. కానీ, వాస్తవ దిగుబడి అంత కంటే 5 నుంచి 10 క్వింటాళ్లు ఎక్కువగా వచ్చిందని రైతులు చెబుతున్నారు. మక్కల సేకరణ కోసం మార్క్​ఫెడ్​ సహకారంతో జిల్లావ్యాప్తంగా ఐదు సెంటర్లు ఓపెన్​ చేశారు. వాటికి అనుబంధంగా గ్రామాల్లో సబ్​ సెంటర్లను ప్రారంభించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎకరానికి 26.50 క్వింటాళ్ల సీలింగ్​ వల్ల రైతులు మిగిలిన పంటను అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. దండేపల్లి మండలానికి చెందిన ఒక రైతు ఐదు ఎకరాల్లో మక్క వేయగా, ఎకరానికి 35 క్వింటాళ్ల చొప్పున 175 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ మక్కలను సెంటర్​కు తరలించాడు.

అధికారులు క్రాప్​ బుకింగ్​ డేటా ప్రకారం ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున ఐదెకరాలకు 132.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన 42.50 క్వింటాళ్లను ప్రైవేట్​ వ్యాపారులకు అమ్ముకున్నాడు. వారు క్వింటాల్​కు రూ.1,750 చెల్లించారు. ఈ లెక్కన రైతుకు రూ.27,625 నష్టం జరిగింది. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 

వ్యాపారులకు ‘మద్దతు’

కొంత మంది వ్యాపారులు రైతుల దగ్గర కొనుగోలు చేసిన మక్కలను తిరిగి మార్క్​ఫెడ్​ సెంటర్లలో మద్దతు ధరకు అమ్ముతూ భారీగా లబ్ధి పొందుతున్నారు. వ్యాపారులు తమకు అనుకూలంగా ఉండే రైతుల నుంచి పట్టా పాస్​బుక్​లు, ఆధార్​ కార్డులు సేకరించి వారి పేరిట సెంటర్లలో అక్రమంగా మక్కలు అమ్ముతునారు.

సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కై ఈ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు. రైతుల విషయంలో క్రాప్​ బుకింగ్​ డేటా ప్రకారం కొనుగోలు చేస్తున్న సెంటర్ల నిర్వాహకులు, వ్యాపారుల విషయంలో మాత్రం నిబంధనలకు పాతరేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎంక్వైరీ జరిపితే మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. 

సీలింగ్​ వల్ల నష్టపోతున్నాం..

ఈ సీజన్​లో 8 ఎకరాల్లో మక్కలు ఏసిన. ఎకరానికి 35 క్వింటాళ్ల చొప్పున 280 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సెంటర్​కు తీసుకొచ్చి 15 రోజులు అయితుంది. ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున 212 క్వింటాళ్లు మాత్రమే కొంటున్రు. మిగిలిన 68 క్వింటాళ్ల మక్కలు బయట అమ్ముకోవాల్సిందే. వ్యాపారులు రూ.1,750 కంటే ఎక్కువ రేటు పెడ్తలేరు. సీలింగ్​తో  నేనే రూ.44,200 నష్టపోతున్న.              

- గడిపెల్లి గణేశ్, కసి​పెల్లి, దండేపల్లి మండలం-

సంచుల కొరతతో కొనుగోళ్లలో జాప్యం

రాష్ట్రవ్యాప్తంగా గన్నీ బ్యాగుల కొరత కారణంగా మక్కల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంచులు అందుబాటులో లేకపోవడంతో రైతులు వారం నుంచి పది రోజులకు పైగా సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు. కాంటా వేసిన తర్వాత లోడ్​ ఎత్తడానికి మరో వారం రోజులు పడుతోంది. సరిపడా లారీలు రాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది.

ఓ వైపు మబ్బులు రావడం, అకాల వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు సంచులు తెచ్చుకుంటే ఒక్కో బ్యాగుకు రూ.22 చొప్పున చెల్లిస్తామని మార్క్​ఫెడ్​ అధికారులు చెబుతున్నారు. కానీ, మార్కెట్​లో గన్నీ బ్యాగుల కొరత ఉందని, రూ.25 చెల్లిస్తామన్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 60 వేల క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశామని, ఇంకా 50 వేల క్వింటాళ్ల వరకు రావచ్చని అధికారులు పేర్కొన్నారు.