ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

రాష్ట్రంలో మరో 8 మందికి కరోనా
పదమూడుకు చేరిన బాధితుల సంఖ్య
ఇండోనేషియా నుంచి వచ్చిన టీమ్‌లో మరో ఏడుగురికి వైరస్
16న స్కాట్లాండ్ నుంచి వచ్చిన యువకుడికి కూడా..

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో మరో ఎనిమిది మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇండోనేషియా నుంచి వచ్చిన టీమ్‌లోని మరో ఏడుగురికి, ఈ నెల 16న స్కాట్లాండ్‌ (యూకే) నుంచి వచ్చిన 22 ఏండ్ల యువకుడి వైరస్ సోకినట్టు ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో కరోనా పేషెంట్ల సంఖ్య పదమూడుకు పెరిగింది. ఒకరు ఇప్పటి కే కోలుకుని ఇంటికి వెళ్లిపోగా.. మిగతా పన్నెండు మంది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు కూడా కొత్తగా స్కాట్లాండ్ నుంచి వచ్చిన యువకుడు ఒక్కడికే కరోనా వచ్చినట్టుగా కన్ ఫర్మ్​ చేశారు . ఆ యువకుడు స్కాట్లాండ్‌లో బీబీఏ చదువుతున్నాడని.. ఈ నెల 16న ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌లో దిగి, మేడ్చల్‌‌లోని ఇంటికి వెళ్లాడని ఆరోగ్య శాఖ తెలిపింది. క్వారంటైన్‌లో ఉండాలన్న ఎయిర్‌ ‌పోర్టు అధికారుల సూచన మేరకు ఆ రోజంతా బాధితుడు ఇంట్లోనే ఉన్నాడని.. మరునాడు జ్వరం, దగ్గుతో గాంధీ హాస్పిటల్‌‌కు వచ్చాడని వెల్లడించింది. అతనికి వైరస్‌ లక్షణాలు ఉండడంతో ఐసోలేషన్‌లో ఉంచి, టెస్టులు చేయగా.. వైరస్‌ సోకినట్టు బుధవారం వెల్లడైందని తెలిపింది. అయితే బుధవారం రాత్రి ఇండోనేషియా టీమ్‌లోని మరో ఏడుగురికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇండోనేషియా నుంచి వచ్చినోళ్లలో ..
ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది టీమ్‌లో మంగళవారమే ఒకరికి కరోనా కన్ ఫర్మ్​ అయింది. బుధవారం మరో ఏడుగురికి కూడా వైరస్ సోకినట్టు టెస్టుల్లో తేలింది. ఇండోనేషియా నుంచి వీరంతా ఈ నెల 13న ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్​‌ క్రాంతి ట్రైన్‌లో రాష్ట్రానికి బయలుదేరారు. 14న రామగుండంలో దిగి కరీంనగర్‌‌‌కు చేరుకున్నారు. అక్కడే రెండ్రోజులు ఓ ప్రార్థనా స్థలంలో ఉన్నారు. వారిలో అనారోగ్యం‌తో బాధపడుతున్న ఒక పేషెంట్‌ను స్థానిక డాక్టర్లు గుర్తించి.. 16న గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఆయనతో వచ్చిన వారిని గాంధీ, ఫీవర్‌‌ హాస్పిటల్స్‌‌లో ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. అందరికీ టెస్టులు చేయగా ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలింది.

కాంటాక్స్ట్ ట్రేస్ చేస్తున్న అధికారులు
ఇండోనేషియా బృందం ఢిల్లీ నుంచి వచ్చిన రైలు బోగీలో 88 మంది ప్రయాణించారని, అందులో 16 మంది తెలంగాణ వాళ్లుకాగా, మిగతావారు ఇతర రాష్ట్రాల వారుగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ టీమ్ కరీంనగర్‌‌లోని ఓ మసీదు వద్ద 30 మందిని కలిసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ 30 మందిని ఇప్పటికే క్వారంటైన్‌ చేశారు . ట్రైన్‌లో వచ్చినవాళ్లందరనీ హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అంతకుముందు ఢిల్లీలో ఈ బృందం నాలుగు రోజులు ఓ మసీదులో ఉందని గుర్తించారు. అక్కడి వాళ్ల కాంటాక్ట్స్‌ను ఢిల్లీ ప్రభుత్వం ట్రేస్ చేస్తోంది. ట్రీట్‌మెంట్ పొందుతున్న కరోనా పేషెంట్లందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రార్థనా మందిరాల్లో అత్యవసర ఏర్పాట్లు
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు . హైదరాబాద్​ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో కూడా దేవాదాయ శాఖ థర్మల్ స్కానింగ్ చేపట్టింది. కరోనా వైరస్‌పై అవగాహనకు చర్యలు చేపట్టింది. భక్తులు ఒక చోట గుమిగూడి ఉండవద్దని మైకులలో ప్రకటించడంతోపాటు పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేస్తోంది. ఆలయాల ప్రాంగణాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తున్నారు. రసాయనాలు చల్లుతూ డిసిన్ ఫెక్షన్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆలయాల అధికారులకు ఆదేశాలు ఇచ్చామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులకు మాస్క్‌ల పంపిణీ, శాని‌టైజర్లను అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు చాలా దేవాలయాల్లో రద్దీ తగ్గింది. భక్తుల సంఖ్య సాధారణంగా కనిపిస్తోంది.

For More News..

నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. అయిదు నిమిషాలు లేటైనా ఓకే..

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్

కరోనాకు భయపడి కేసీఆర్ ఫాంహౌస్‌లో దాక్కున్నారు

Latest Updates