కరీంనగర్​లో కరోనా అలర్ట్​ : రోజు రోజుకి పెరుగుతున్న కేసులు

జిల్లాలో 281 యాక్టివ్​కేసులు
నాలుగైదు రోజుల్లోనే 48మందికి..
ఒకే గ్రామంలో 33 మందికి పాజిటివ్
టెస్టుల సంఖ్య పెంచిన ఆఫీసర్లు
మెట్​పల్లిలోని ఓ బ్యాంక్​ స్టాఫ్​కు ​కరోనా, బ్రాంచ్ ​క్లోజ్

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మృతిచెందారు. అతని అంత్యక్రియల్లో చాలామంది పాల్గొన్నారు. రెండు రోజుల తరవాత  అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తి ఒకరికి కరోనా లక్షణాలు రావడంతో అనుమానంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖ గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసింది. అంత్యక్రియల్లో పాల్గొన్న అందరికీ పరీక్షలు చేశారు. మొత్తం 33 మందికి పాజిటివ్ అని తేలింది. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ లోనూ అనుమానం వచ్చి కరోనా పరీక్షలు
నిర్వహించగా ముగ్గురికి  పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

కరీంనగర్ జిల్లాలోని రెండు గ్రామాల్లో అనుమానం వచ్చి చెక్ చేయడంతో బయటపడిన కేసులివి. ఇంకా బయటపడనివి ఎన్ని ఉన్నాయో తెలియదు.  గ్రామాల్లో ఒకరికి తెలియకుండా మరొకరికి కరోనా వ్యాప్తి జరుగుతూనే ఉంది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 281 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ రావడం.. ప్రభుత్వం సైతం లాక్ డౌన్ రూల్స్​పూర్తిగా సడలించడంతో ప్రజలు కూడా కరోనా వైరస్ ఉందనే విషయాన్ని మరిచిపోయి తిరుగుతున్నారు. చాలామంది ఫిజికల్​డిస్టెన్స్ పాటించడం లేదు. శానిటైజర్, మాస్క్ వంటివి వినియోగించడం లేదు. ఇష్టారీతిగా వ్యవహరిస్తుండడంతో వైరస్ మరింతగా వ్యాప్తించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మళ్లీ టెస్టులు షురూ

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు  పెరుగుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని  పీహెచ్ సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో మునుపటిలాగానే కరోనా పరీక్షలు చేస్తున్నారు.  ఇక జిల్లా ప్రధాన ఆసుపత్రి, కరీంనగర్ లో ఆర్టీపీసీఆర్, మండలాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో   ర్యాపిడ్ యాంటీజెన్  పరీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు.. గ్రామాల్లో అనుమానం ఉన్నచోట హెల్త్ సిబ్బంది ర్యాపిడ్ టెస్టులు చేపడుతున్నారు. రెండు రోజులుగా పరీక్షల సంఖ్య పెంచారు. ఆదివారం మొత్తం 503 మందికి, సోమవారం 997 మందికి ర్యాపిడ్​యాంటీజెన్​పరీక్షలు చేశారు. ఆదివారం నుంచి సోమవారానికి పరీక్షల సంఖ్య డబుల్ అయింది. అదే విధంగా కేసులు కూడా ఆదివారం నాలుగు రాగా.. సోమవారం ఎనిమిదికి చేరాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 281 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 211 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 17 మంది జిల్లా ఆసుపత్రిలో, ఒకరు గాంధీలో, 18 మంది హైదరాబాద్ లోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారంతా కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నారు. ఈ నాలుగైదు రోజుల్లోనే 48 పాజిటివ్ కేసులు వచ్చాయి.

మెట్పల్లి ఎస్బీఐలో కరోనా.. బ్రాంచ్ క్లోజ్

మెట్​పల్లి: జగిత్యాల జిల్లా మెట్​పల్లి టౌన్​లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఏడీబీ) స్టాఫ్​కు కరోనా సోకింది. మేనేజర్, అకౌంటెంట్, ఫీల్డ్ ఆఫీసర్ తో పాటు మరొకరికి పాజిటివ్​అని తేలడంతో సోమవారం బ్రాంచ్​ను క్లోజ్​చేశారు. బిల్డింగ్​ మొత్తం శానిటైజ్​ చేయించారు. బ్యాంకులోని ఒక ఉద్యోగి వారం రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. రెండు రోజులు లీవ్ తీసుకుని డ్యూటీకి వచ్చాడు. అతనితో కలిసి మిగిలిన ఎంప్లాయ్స్​ భోజనం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వారికి కూడా జలుబు, దగ్గు స్టార్ట్ అయ్యాయి. అనుమానంతో అంతా ఆదివారం కరోనా టెస్ట్ చేయించుకున్నారు. సోమవారం ఉదయం పాజిటివ్​ అని తెలిసింది. ముందు జాగ్రత్తగా బ్యాంక్ ను మూసివేశారు.

పెరిగినప్పుడే హడావుడి

అధికారులు సైతం కొవిడ్ విషయంలో ప్రజలలానే నిర్లిప్తత ప్రదర్శించారు. ఇన్ని రోజులు పీహెచ్ సీల్లో టెస్టులు సైతం బంద్ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాల(అంతిమ యాత్రలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు) పట్ల ఎలాంటి సూచనలు, సలహాలు అందివ్వడం లేదు. ఇప్పుడు కొత్తగా కేసులు వస్తుండటంతో పీహెచ్ సీల్లో, గ్రామాల్లో  హడావుడి చేస్తున్నారు. వాక్సిన్ వచ్చినా.. ఇంకా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాలేదు. గ్రామ స్థాయిలో ఉండే అధికారులు సైతం అప్రమత్తంగా ఉంటూ ప్రజలంతా కొవిడ్ రూల్స్​పాటించేలా చూడాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తోంది.

అలర్ట్ గా ఉండాలి

ఎవరికైనా జలుబు, జ్వరం,  దగ్గులాంటి  లక్షణాలు ఉంటే  ఆలస్యం చేయకుండా వెంటనే  దగ్గరలోని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.  గ్రామాలు, పీహెచ్ సీల్లో టెస్టులు చేస్తున్నం. ఈ సంఖ్యను ఇంకా పెంచుతం. ప్రమాదకర స్థాయిలో లేకున్నా.. అప్రమత్తంగా ఉండటం అందరికీ మంచిది. – డాక్టర్ సుజాత, డీఎంహెచ్ వో, కరీంనగర్

Latest Updates