పేషంట్లు రాక కరోనా బెడ్లు ఖాళీ

తగ్గుతున్న కేసులు.. 84 శాతం పేషెంట్లు హోమ్​ ఐసోలేషన్​లోనే

క్రిటికల్​గా ఉంటేనే ఆస్పత్రులకు

పేషెంట్లు రాక ఐసోలేషన్​ వార్డులను ఎత్తేసిన 63 ప్రైవేట్‌ హాస్పిటళ్లు

ఐసీయూ మాత్రమే కొనసాగింపు

2 నెలల క్రితం వరకు రికమండేషన్​ ఉంటేనే బెడ్డు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో దాదాపు 80 శాతం కరోనా బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. 2 నెలల కిందటి వరకూ ప్రైవేటు దవాఖాన్లలో బెడ్డు దొరికిచ్చుకోవాల్నంటే  మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలతో రికమండ్ చేయించుకునే పరిస్థితి ఉండేది. అయితే.. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, కరోనా సోకినవారిలో ఎక్కువ మంది హోం ఐసోలేషన్​కే  ప్రిఫరెన్స్​ ఇవ్వడంతో హాస్పిటళ్లలో బెడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్​ ఐసోలేషన్ కేంద్రాలను ఎత్తేసి ఐసీయూ సేవలనే  కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కరోనా పేషెంట్ల కోసం 17,526 బెడ్లు కేటాయించగా.. ఇందులో నెల రోజులుగా  బెడ్ ఆక్యుపెన్సీ 20% లోపే ఉంటోంది.

దీంతో కరోనా ట్రీట్‌మెంట్ బంద్ పెట్టి, సాధారణ వైద్య సేవలు ప్రారంభించేందుకు ప్రైవేట్ దవాఖాన్ల యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే 8 దవాఖాన్లు కరోనా సేవలు పూర్తిగా బంద్ పెట్టాయి. హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు కూడా  కరోనా సేవలను ఏదైన ఒక బ్రాంచ్‌కే పరిమితం చేస్తున్నాయి. చాలా హాస్పిటళ్లలో జనరల్ ఐసోలేషన్, ఆక్సిజన్ బెడ్లలో 90 శాతం ఖాళీగానే ఉంటున్నాయి. అత్యంత సీరియస్‌గా ఉన్న వ్యక్తులే హాస్పిటళ్లకు వస్తుండటంతో.. వాళ్లను నేరుగా ఐసీయూలోనే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా హాస్పిటళ్లలో సాధారణ ఐసోలేషన్‌ బెడ్లు, ఆక్సిజన్‌ బెడ్లను ఎత్తేస్తున్నారు. 63 హాస్పిటల్స్‌లో ఐసోలేషన్ బెడ్లను పూర్తిగా ఎత్తేశారు.  మరో 10 హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌ పడకలను పూర్తిగా తీసేశారు.

డయాగ్నసిస్ సెంటర్లు ఖాళీ

జూన్​ దాకా కరోనా టెస్టు చేయించుకోవాలంటే పెద్ద కథ. ప్రభుత్వం దవాఖాన్లలో టెస్టులు చేయలేదు.. ప్రైవేట్‌లో టెస్టులకు ప్రభుత్వం పర్మిషన్ ఇయ్యలేదు. జూన్ 15న ప్రైవేట్ డయాగ్నసిస్ సెంటర్లకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఒక్కసారి డయాగ్నస్టిక్ సెంటర్ల ముంగట పెద్ద పెద్ద క్యూ లైన్లు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ దాకా టెస్టుల కోసం డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం రోజూ 38 వేల నుంచి 40 వేల వరకు టెస్టులు చేస్తుండగా, ఇందులో 2 నుంచి 3 వేల టెస్టులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో జరుగుతున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అడ్డగోలుగా వసూలు చేసిన ల్యాబ్​లు.. ఇప్పుడు టెస్టుల ధరలపై డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా 46 ప్రైవేట్ కరోనా డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఇందులో కొన్ని ప్రముఖ సంస్థలకే గిరాకీ ఉండగా, మిగిలిన వాటిలో అంతంతగానే ఉందని నిర్వహకులు
చెబుతున్నారు.

84 శాతం మంది ఇండ్లలోనే

వారం రోజులుగా ఆరోగ్య శాఖ ఇస్తున్న లెక్కల ప్రకారం రోజూ 1,500 లోపే కేసులు నమోదవుతున్నాయి. ఇందులో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండి, సీరియస్‌గా ఎఫెక్ట్‌ అవుతున్న వాళ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం రాష్ర్టంలో 20,183 మంది కరోనా యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. వీరిలో 1,861 మంది ప్రైవేట్ దవాఖాన్లలో, 1,345 మంది ప్రభుత్వ దవాఖాన్లలో చికిత్స పొందుతున్నారు. మొత్తం యాక్టివ్ పేషెంట్లలో 16 శాతం మంది మాత్రమే దవాఖాన్లలో ఉన్నారు. మిగతా 84 శాతం మంది ఇండ్లలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. దాదాపు నెల రోజులుగా ఇలానే ఉంటోంది. గతంలో వైరస్ లక్షణాలు ఉన్నా సర్కార్ టెస్టులు చేయలేదు. దీంతో వైరస్ లంగ్స్‌ మీద ఎటాక్ చేసి చాలా మంది హాస్పిటళ్ల పాలయ్యారు. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా టెస్టింగ్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. జనాలు అప్రమత్తంగా ఉంటున్నారు. సింప్టమ్స్‌ మొదలైనా, ఎవరైనా పేషెంట్‌తో కాంటాక్ట్ అయినట్టు తెలిసినా వెంటనే టెస్టు చేయించుకుంటున్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వెంటనే అవసరమైన మెడిసిన్ ప్రారంభించి, వైరస్ ముదరకముందే కోలుకుంటున్నారు. హాస్పిటళ్లలో పేషెంట్ల సంఖ్య తగ్గడానికి ఇది కూడా ఓ కారణమేనని డాక్టర్లు చెబుతున్నారు.

80 హాస్పిటళ్లలో ఒక్క పేషెంటూ లేడు

మొత్తం 228 ప్రైవేట్‌ దవాఖాన్లు కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తుండగా, వీటిలో 80 హాస్పిటళ్లలో బుధవారం నాటికి అసలు ఒక్క పేషెంట్ కూడా లేరు. మరో 110 హాస్పిటళ్లలో పది మంది కంటే తక్కువ మంది పేషెంట్లు ఉన్నారు. కరోనా ట్రీట్‌మెంట్‌కు కేరాఫ్‌గా మారిన గాంధీలోనూ 75% బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. అక్కడ సుమారు 1,900 బెడ్లు ఉంటే, ప్రస్తుతం 440 మంది పేషెంట్లే ట్రీట్​మెంట్ పొందుతున్నారు. గాంధీ సహా మొత్తం 61 ప్రభుత్వ దవాఖాన్లలో కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తుండగా, ఇందులో 18 దవాఖాన్లలో ఒక్క పేషెంట్ కూడా లేరు. మరో 20 హాస్పిటళ్లలో పది మంది కంటే తక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో దవాఖాన్లలో సాధారణ ఓపీ, సర్జరీ, ఇతర అన్ని సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

For More News..

చెరువులను కబ్జా చేస్తుంటే మీరేం చేస్తున్నరు?

Latest Updates