కరోనాతో బోనాలకు బ్రేక్‌‌‌‌

సిటీలో మొదటిసారి కండీషన్లతో పూజలు 

మూసీకి వరదలు వచ్చినా గోల్కొండలో బోనాలు

మత కల్లోలాల టైమ్ లోనూ ఓల్డ్‌ సిటీలో ఘటాల ఉరేగింపు

గత్తరకు మొక్కుగా పుట్టిన లష్కర్‌‌‌‌ బోనాలూ ఎన్నడూ ఆగలే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : హైదరాబాద్లో బోనాలు ఫేమస్. సెంటిమెంట్ కూడా. గోల్కొండ, పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలకు ఎంతో విశిష్టత. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు మరింత స్పెషల్. తీరొక్క బోనాలు.. పోతరాజు విన్యాసాలు.. ఘటాల ఊరేగింపులతో ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్లూ సిటీకి చేరుకుంటారు. నిజాం కాలం నుంచి హైటెక్ యుగం దాకా ఈ సంస్కృతి కొనసాగుతూ వస్తోంది. అటువంటి బోనాలు నగరంలో ఎంతటి విపత్తు వచ్చినా ఆగలేదు. ఇపుడు కరోనా వైరస్ వల్ల మొదటిసారిగా బ్రేక్ పడింది. అమ్మవార్లకు పూజలు, బోనాల సమర్పణ భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. గోల్కొండ బోనాలు ఇప్పటికే సాదాసీదాగా సాగుతుండగా, ఈ నెల 12న జరిగే లష్కర్ బోనాలు సైతం  హంగూ ఆర్బాటం లేకుండా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

మూసీ వరదలతో

లాలాదర్వాజ బోనాలు 1908లో మూసీ నదికి వరదలు వచ్చి నగరం పూర్తిగా మునిగిపోయింది. ప్రజలను ముంపు నుంచి రక్షించడంలో అయోమయంలో పడ్డ అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్.. ప్రధాని మహారాజ్ కిషన్ ప్రసాద్ సలహా కోరారు. అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఇలాంటి ప్రళయం సంభవిస్తుందని, ఆమె ను శాంతింప చేయడానికి పూజలు చేయాలని ఆయన సూచించారు. దాంతో నిజాం నవాబు బంగారు చాటలో లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, చీర, రవిక సమర్పించి పూజలు చేశారు. అమ్మవారు శాంతించాలంటూ హారతి ఇవ్వడంతో వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని చెప్తుంటారు. అప్పటి నుంచి ఏటా ఆషాఢ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించి 1968లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్టాపన చేశారు.  మొదట్లో బోనాలకు ఇక్కడ జంతు బలులు ఇచ్చేవారు. 1953 నుంచి నిషేధించారు. 1980 ప్రాంతంలో మత కల్లోలాలు జరిగినప్పుడు కూడా ఇక్కడ బోనాల ఉత్సవాలకు బ్రేక్‌‌‌‌ పడలేదు.

లష్కర్ బోనాలకు వైరసే కారణం

లష్కర్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 200 ఏండ్ల చరిత్ర ఉంది. సికింద్రాబాద్ ఏరియా 18వ దశకంలో ఓ గ్రామంగా ఉండేది.1813లో ఇక్కడ ప్లేగు(గత్తర) వ్యాధి వేల మందిని బలిగొంది. జంట నగరాలను అల్లకల్లోలం చేసింది. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు సికింద్రాబాద్ కు చెందిన అమ్మవారి భక్తుడు సురిటి అప్పయ్య మిలటరీలో పని చేస్తూ తన బెటాలియన్తో మధ్యప్రదేశ్కు బదిలీ అయ్యాడు. నగరంలో ప్లేగు వ్యాధి సోకిన  విషయం తెలుసుకుని అక్కడున్న ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లాడు. హైదరాబాద్లో ప్లేగు వ్యాధి తగ్గితే సికింద్రాబాద్లో ప్రతిష్టిస్తానని మొక్కాడు. సిటీలో  ప్లేగు తగ్గడంతో 1815లో  ఉజ్జయిని నుంచి అమ్మవారి కర్ర విగ్రహం తెచ్చి సికింద్రాబాద్ జనరల్ బజార్లోని పెద్ద వేప చెట్టు కింద ప్రతిష్టించాడు. అప్పటి నుంచి ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించిఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడున్న గుడి ప్రాంతంలో అప్పట్లో పెద్ద బావి ఉండేది. దాని మరమ్మతులు చేస్తుండగా తవ్వకాల్లో మాణిక్యాల దేవి విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని  అమ్మవారి విగ్రహం పక్కనే కుడివైపున ప్రతిష్టించారు. కర్ర విగ్రహం వర్షానికి తడిసిపోతుండడంతో1864లో ఆ స్థానంలో ప్రస్తుతం ఉన్న విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటినుంచి సురిటి వంశస్తులు ట్రస్టీలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 6వ తరానికి చెందిన సురిటి కృష్ణ ఆలయ ట్రస్టీగా ఉన్నారు.

వెయ్యేండ్ల గోల్కొండ బోనాలు

సిటీలో బోనాలు ప్రారంభమైయ్యేది, ముగిసేది గోల్కొండ కోట మీదున్న జగదాంబిక ఆలయంలోనే. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ బోనాల నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కోపం వస్తే అంటువ్యాధులు వస్తాయని నమ్మి, వెయ్యేండ్ల కిందటే బోనాల పండుగను గోల్కొండలో మొదలు పెట్టారని చెప్తుంటారు. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కూడా ఉత్సవాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. గోల్కొండ మొదటి బోనం పటేల్ గిరి వంశస్తులు సమర్పించడం ఆనవాయితీ. ఆ రోజుల్లో ఐదో నిజాం పటేల్ లక్ష్మమ్మతో బోనం తయారు చేయించి, అధికార లాంఛనాలతో అమ్మవారికి సమర్పించేవారని చరిత్ర చెప్తోంది. 1908 నాటి వరదలతో సిటీలోని చాలా ప్రాంతాల్లో బోనాలు ఆగినా గోల్కొండలో ఉత్సవాలు జరిగాయి.

సాదాసీదాగా నాలుగో పూజ

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆదివారం నాలుగో పూజ చేశారు. ఈవో, పూజారులు, వృత్తి దారులను మాత్రమే పోలీసులు కోటలోకి అనుమతించారు. భక్తులు కోట గేటు దగ్గరే మొక్కులు చెల్లిం చుకొని వెళ్లారు. కేంద్రం ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఖిలా లోకి డైలీ 2వేల మందిని టూరిస్టులను అనుమతిం చనున్నారు. భక్తులకు బోనా లు, తొట్టెలతో రావద్దని అధికారులు తెలి పారు. లష్కర్ ఉజ్జయిని మహంకాళిని ఆదివారం 4 వేలమంది దర్శించుకున్నా రు. చాలామంది బోనాలను సమర్పించా రు. ఉమ్మడి దేవాలయాల ఉత్సవ  కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు.

Latest Updates