అపుడు 2 నెలలకు 1000..ఇపుడు నెలకే 50 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్పీడ్‌‌గా పెరిగిపోతున్నాయి. వారం వారం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తొలి కేసు నుంచి వెయ్యికి చేరడానికి 2 నెలలు పడితే అక్కడి నుంచి 10 వేలవ్వడానికి 15 రోజులే పట్టింది. ఆ తర్వాత 3 వారాలకే 50 వేల మార్క్‌‌ను చేరుకుంది. ప్రస్తుతం 78 వేల కేసులతో ప్రపంచవ్యాప్తంగా 12 ప్లేస్‌‌లో ఉంది. దేశంలో ఇప్పటివరకు 17 లక్షలకు పైగా టెస్టులు చేశారు.

వారంలో 50 వేల నుంచి 78 వేలకు

దేశంలో తొలి కేసు జనవరి 30న నమోదైంది. ఆ తర్వాత మార్చి 28కి అంటే 2 నెలలకు వెయ్యి కేసులయ్యాయి. తర్వాత 10 వేలకు చేరడానికి 15 రోజుల (ఏప్రిల్‌‌ 13) టైమ్‌‌ పట్టింది. తర్వాత 7 రోజుల్లోనే ఏప్రిల్‌‌ 21 నాటికి 20 వేలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ వారానికి అంటే ఏప్రిల్‌‌ 28కి 30 వేల మార్క్‌‌ చేరుకున్నాయి. మళ్లీ వారం తర్వాత 20 వేల కేసులు పెరిగి మే 6 నాటికి 50 వేల కేసులయ్యాయి. తాజాగా 7 రోజుల తర్వాత బుధవారం నాటికి 28 వేలు పెరిగి 78 వేల కేసులు దాటాయి.

కోలుకుంటున్నోళ్లూ ఎక్కువే

దేశంలో ఏప్రిల్‌‌ 13 నాటికి 10 వేల కేసులవగా అంతకంటే ఒక్క రోజు ముందు ఏప్రిల్‌‌ 12 నాటికి కోలుకున్న వారి సంఖ్య వెయ్యి దాటింది. తర్వాత మే 1 నాటికి అంటే  రెండు వారాల్లో ఈ సంఖ్య 10 వేలకు చేరువైంది. తర్వాత  పది రోజుల్లోనే మే 10 నాటికి మరో 10 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కొవిడ్‌‌ నుంచి కోలుకున్నారు. దేశంలో వైరస్‌‌ బారిన పడి చనిపోతున్న వాళ్లూ పెరుగుతున్నారు. దేశంలో మార్చి 12న తొలి మరణం నమోదవగా తర్వాత 46 రోజులకు ఏప్రిల్‌‌ 28న ఈ సంఖ్య 1,000 దాటింది. మే 9 నాటికి 2 వేల మంది మృతి చెందారు. బుధవారం నాటికి 2,400 దాటింది.

మహారాష్ట్రలోనే మూడో వంతు

దేశంలో ఎక్కు వ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. దేశంలోని మొత్తం కేసుల్లో మూడో వంతు ఇక్కడే నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలోని కేసుల్లో సగం కంటే ఎక్కు ముంబైలోనే రికార్డయ్యాయి. మహారాష్ట్రలో కేసులు మంగళవారం నాటికి 24 వేలు దాటాయి. ముంబైలో 14 వేల మందికి వైరస్‌‌ సోకింది. పుణేలో 2,900 మందికి పైగా, థానేలో 2,800 మందికి పైగా కొవిడ్‌‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో వైరస్‌‌ వచ్చిన వాళ్లలో ఐదో వంతు మంది ఇప్పటివరకు కోలుకున్నారు. మే 13 నాటికి 5 వేల మందికి పైగా క్యూరయ్యారు. కొవిడ్‌‌తో దేశవ్యాప్తంగా చనిపోయిన వాళ్లలో మూడోవంతుకు పైగా రాష్ట్రంలోనే మరణించారు. ఇప్పటివరకు 900 మందికి పైగా మృతి చెందారు.

గుజరాత్‌‌, తమిళనాడుల్లో..

మహారాష్ట్ర తర్వాత కొవిడ్‌‌కు ఎక్కువ ఎఫెక్టయిన రాష్ట్రాలు గుజరాత్‌‌, తమిళనాడు, ఢిల్లీ. గుజరాత్‌‌లో బుధవారం వరకు 8,900కు పైగా కేసులు నమోదవగా 537 మంది చనిపోయారు. తమిళనాడులో 8,700కు పైగా కేసులు, 60కి పైగా మరణాలు.. ఢిల్లీలో 8 వేల కేసులు, 100కు పైగా మరణాలు నమోదయ్యాయి.

కార్డు ఉన్నా లేకపోయినా రేషన్ ఇవ్వాల్సిందే..

Latest Updates