భద్రాద్రిలో పాజిటివ్ నుంచి నెగిటివ్ కు చేరిన కరోనా కేసులు

కరోనా కట్టడికి భద్రాద్రి కొత్తగూడెం ఆఫీసర్లు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ సునీల్ దత్ అనునిత్యం పరిస్థితులను పర్యవేక్షిస్తూ లాక్డౌన్ పక్కాగా అమలయ్యేలా చూశారు. కలెక్టర్ నేతృ త్వంలో అన్ని శాఖల అధికారులు చేపట్టిన చర్యల ఫలితంగా మార్చి 24 తరువాత ఒక్క కరోనా కేసు కూడా జిల్లాలో నమోదు కాలేదు. పాజిటివ్ వచ్చిన నలుగురు కూడా కోలుకోవడంతో ఇప్పుడు కేసుల సంఖ్య జీరుకు చేరింది. మార్చి 12న మొదటి కేసు.. జిల్లాలోని అశ్వాపురం మండలంలో ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతికి మొదటగా కరోనా వచ్చినట్టు మార్చి 12న డాకర్లు గుర్తించారు. లండన్ నుంచి వచ్చిన కొత్తగూడెం డీఎస్పీ కొడుకుకు మార్చి 22న కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇదే క్రమంలో డీఎస్పీకి, వాళ్లింట్లో పని చేసే మరో మహిళకు వైరస్ వ్యాపించింది. ఒకేసారి ఒకే ఇంట్లో ముగ్గురికి వైరస్ అంటుకోవడంతో కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగారు. అన్ని శాఖల ఆఫీసర్లను అలర్ట్ చేశారు. డాక్టర్ శ్రీనునాయక్ ను ప్రత్యేక ఆఫీసర్ గా నియమించారు. ఇటలీ నుంచి వచ్చిన యువతి, లండన్ నుంచి వచ్చిన యువకుడు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారనే వివరాలను ప్రత్యేక బృందాలతో సేకరించారు. దాదాపు 150 మందికి పైగా క్వారంటైన్ కు తరలించి చికిత్స అందించారు. ఇదే క్రమంలో మర్కజ్ సంఘటన తెరపైకి రావడంతో మరింత అప్రమత్తమయ్యారు. తబ్లిక్ జమాత్ కు వెళ్లివచ్చిన 10 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించారు.

Latest Updates