దేశంలో అరకోటి దాటినయ్​..3 రాష్ట్రాల్లోనే 44 శాతం కేసులు

  • కేసులు 5 లక్షలు దాటిన రాష్ట్రాలూ అవే
  • 11 రాష్ట్రాల్లో లక్ష నుంచి 5 లక్షల లోపు కేసులు
  • 11 రోజుల్లోనే దేశంలో 10 లక్షల కేసులు
  • మరో 1,280 మంది కరోనాకు బలి
  • ఒక్కరోజు మరణాల్లో ఇదే ఎక్కువ
  • ఇప్పటిదాకా 5.83 కోట్ల టెస్టులు

న్యూఢిల్లీ:దేశంలో కరోనా కేసులు అరకోటి దాటాయి. మంగళవారం 90,970 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 50 లక్షల 17 వేల 884కి పెరిగాయి. సెప్టెంబర్​ 4న కేసులు 40 లక్షల మార్కును దాటగా.. కేవలం 11 రోజుల్లోనే మరో 10 లక్షల మంది దాని బారిన పడ్డారు. సెప్టెంబర్​ 9 నుంచి వరుసగా నాలుగైదు రోజులు కరోనా కొత్త కేసులు రోజూ 90 వేలకుపైగానే నమోదయ్యాయి. 11వ తేదీన అత్యధికంగా 97,654 కేసులు వచ్చాయి. ఓవైపు కేసులు పెరుగుతున్నా.. మరోవైపు రికవరీలూ అదే స్థాయిలో ఉంటున్నాయి. ఇప్పటిదాకా 39 లక్షల 39 వేల 049 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 9 లక్షల 96 వేల 032 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. మంగళవారం కరోనాకు 1,280 మంది బలయ్యారు.ఇప్పటిదాకా ఒక్కరోజు మరణాల్లో ఇదే హయ్యెస్ట్​. దీంతో మొత్తంగా 82,088 మంది చనిపోయారు.

5.83 కోట్ల టెస్టులు

10 లక్షల 97 వేల 806 కేసులు, 30,409 మరణాలతో మహారాష్ట్ర ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. కేసుల్లో ఏపీ, మరణాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నాయి. కేసులు ఐదు లక్షలు దాటిన జాబితాలో మూడు రాష్ట్రాలున్నాయి. లక్ష నుంచి 5 లక్షల లోపు కేసుల జాబితాలో 11 రాష్ట్రాలున్నాయి. మొదటి మూడు స్థానాల్లో ఉన్న మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడుల్లోనే కేసుల వాటా 44 శాతం కావడం గమనార్హం. ఆ మూడు రాష్ట్రాలు కలిపి 21 లక్షల 95 వేల 939 మందికి కరోనా సోకింది. ఇప్పటిదాకా 5 కోట్ల 83 లక్షల 12 వేల 273 టెస్టులు చేశారు. మంగళవారం 10 లక్షల 72 వేల 845 శాంపిళ్లు టెస్ట్​ చేశారు. ప్రపంచంలో మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 3 కోట్లు దాటే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 2 కోట్ల 96 లక్షల 7 వేల 337 మంది దాని బారిన పడగా.. 9 లక్షల 35 వేల 895 మంది చనిపోయారు.

40 లక్షల మందిపై నిఘా

కాంటాక్ట్​ ట్రేసింగ్​లో భాగంగా 40 లక్షల మందిపై నిఘా ఉంచినట్టు కేంద్రం తెలిపింది. ఇంటిగ్రేటెడ్​ డిసీజ్​ సర్వైలెన్స్​ ప్రోగ్రామ్​ (ఐడీఎస్పీ) కింద కమ్యూనిటీ సర్వైలెన్స్​ ద్వారా  ట్రేస్‌​ చేస్తున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ చౌబే మంగళవారం రాజ్యసభలో తెలిపారు.

Latest Updates