కరోనా కేసులు పెరుగుతున్నా.. ఐసోలేషన్ సెంటర్లు లేవ్

కరోనా కేసులు పెరుగుతున్నా.. ఐసోలేషన్ సెంటర్లు లేవ్
  • సర్కిళ్ల వారీగా అందుబాటులోకి రాలే
  • మెజారిటీ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే..
  • వైరస్​ నియంత్రణను గాలికి వదిలేసిన బల్దియా ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ చుట్టూ కరోనా ముప్పు పొంచి ఉన్నది. రోజురోజుకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కొవిడ్​కేసులు పెరిగిపోతున్నాయి. వందల సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారు. ఆఫీసర్లు మాత్రం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టట్లేదు. నెల కిందట సర్కిళ్ల వారీగా ఐసోలేషన్ సెంటర్లు పెడతామని చెప్పిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, ఇప్పటివరకు కావాల్సిన సౌకర్యాలు కల్పించలేదు. వైరస్ ​నియంత్రణకు అవసరమైన మందులు, బెడ్లు, కిట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. గ్రేటర్​వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మెజారిటీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో జనం హడలిపోతున్నారు. వారం రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో డైలీ వెయ్యి మంది కరోనా బారినపడుతున్నారు. అయినప్పటికీ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో రద్దీ తగ్గట్లేదు. 

బల్దియా చర్యలేవి?
గతంలో థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు బల్దియా సిద్ధంగా ఉందని మేయర్, కమిషనర్ ప్రకటించారు. కానీ నెలరోజులుగా సిటీలో కేసులు విపరీతంగా పెరుగుతున్నా ఎలాంటి నియంత్రణ చర్యలు అమలు చేయట్లేదు. 30 సర్కిళ్ల పరిధిలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారే కానీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. గతేడాది ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లలోనే సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినా ఇప్పటికీ ఏ ఒక్క ఐసోలేషన్ లోనూ బెడ్లు ఏర్పాటు చేయలేకపోయారు. కేసులు మరింత పెరిగితే పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్​టెస్టింగ్ సెంటర్లు, వ్యాక్సిన్ సెంటర్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు పాటించట్లేదు. కేసులు వస్తున్న ఏరియాలో డిస్​ఇన్ ఫెక్షన్ స్ప్రే చేయట్లేదు. గతంలో మాదిరి కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయకపోయినా కనీసం కేసులు ఉన్న సైడ్​రాకపోకలు బంద్​చేయట్లేదు.

ఓయూ వీసీకి కరోనా
ఓయూ: ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ​చాన్స​లర్​ ప్రొఫెసర్​ రవీందర్ ​యాదవ్ కరోనా బారిన పడ్డారు.  ఆయనకు జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉండటంతో బుధవారం  కరోనా టెస్ట్​ చేయించుకోగా  పాజిటివ్​గా తేలింది.    లక్షణాలు ఉన్నప్పటికీ  ఆరోగ్య సమస్యలు లేవని  అధికారులు తెలిపారు.  ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని 
వీసీ రవీందర్​ యాదవ్ సూచించారు.

ఐదుగురు పీహెచ్​సీ స్టాఫ్​కు కరోనా
పద్మారావునగర్ : బన్సీలాల్​పేట డివిజన్​ఐడీహెచ్​కాలనీలోని గాంధీ అర్బన్​ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఒకేరోజు ఐదురుగు స్టాఫ్​ కరోనా బారిన పడ్డారు. వీరిలో హెల్త్​ ఆఫీసర్, ల్యాబ్​ టెక్నిషీయన్​, ఏఎన్​ఎమ్, స్టాఫ్​ నర్సు, ఆశ కార్యకర్త ఉన్నారు. అర్బన్​ సెంటర్​ లోని మరికొంత సిబ్బంది జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఐదుగురికి పాజిటివ్​ రావడంతో రెండ్రోజులుగా సెంటర్​లో కొవిడ్​ టెస్టులు నిలిచిపోయాయి.  టెస్టుల కోసం వచ్చేవారిని బోయిగూడ అర్బన్​హెల్త్ సెంటర్​కు పంపిస్తున్నారు. కరోనా బారినపడ్డ స్టాఫ్  కోలుకుని రాగానే సెంటర్​లో మళ్లీ  టెస్టులు చేస్తామని సిబ్బంది చెప్తున్నారు.