పుణేలో క్వారంటైన్ సెంట‌ర్ గా మ‌సీదు

దేశ వ్యాప్తంగా రోజురోజుకీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెరుగుతోంది. ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్నాయి. వైర‌స్ బారిన ప‌డిన వారికి చికిత్స అందించేందుకు ఆస్ప‌త్రుల్లో స‌దుపాయ‌ల‌ను క‌ల్పిస్తున్నాయి. అలాగే క‌రోనా అనుమానితుల‌ను ఐసోలేష‌న్ లో ఉంచి ప‌ర్య‌వేక్షించేందుకు భారీ స్థాయిలో క్వారంటైన్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ప్ర‌భుత్వాలు సిద్ధం చేస్తున్న ఆస్ప‌త్రుల‌కు తోడుగా కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు, కాలేజీల బిల్డింగ్ ల‌ను, దేవాల‌యాల వ‌స‌తి స‌ముదాయాల‌ను క్వారంటైన్ సెంట‌ర్ల‌కు అప్ప‌గించాయి. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లోని పుణేలో ఓ మ‌సీదును క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చేందుకు అప్ప‌గించారు ముస్లిం మ‌త పెద్ద‌లు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా క్రైసిస్ ను ఎదుర్కొంటున్న ఈ స‌మ‌యంలో మాన‌వ‌త్వంతో తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వారు చెప్పారు. దీంతో వెంట‌నే మ‌సీదు కాంప్లెక్స్ మొత్తాన్ని మున్సిప‌ల్ అధికారులు డిస్ ఇన్ఫెక్ట్స్ తో శానిటేష‌న్ చేశారు. ఆ త‌ర్వాత అక్క‌డ భారీ సంఖ్య‌లో బెడ్స్ ఏర్పాటు చేశారు.

దేశ వ్యాప్తంగా ఆదివారం వ‌ర‌కు 28,380 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో 886 మంది మ‌ర‌ణించ‌గా.. 6362 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే 8068 కేసులు ఉన్నాయి. వాటిలో ముంబైలో 5407, పుణేలో 1052, థానేలో 738 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

Latest Updates