తెలంగాణ‌లో మ‌రో 99 క‌రోనా కేసులు.. 90 దాటిన మ‌ర‌ణాలు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. వ‌రుస‌గా కొన్ని రోజులు నుంచి క‌రోనా పాజిటివ్ కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతూ వ‌స్తోంది. గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 99 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. న‌లుగురు మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై మంగ‌ళ‌‌వారం రాత్రి 8 గంట‌ల‌కు బులిటెన్ విడుద‌ల చేసింది ఆరోగ్య శాఖ‌. రాష్ట్రంలో సోమ‌వారం సాయం‌త్రం ఐదు గంట‌ల నుంచి మంగ‌ళ‌‌వారం సాయంత్రం ఐదు గంట‌ల మ‌ధ్య న‌మోదైన కేసులు, మ‌ర‌ణాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గ‌డిచిన‌ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 99 కేసులు న‌మోదు కాగా..ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2891కి చేరింది. న‌లుగురు మ‌ర‌ణించ‌గా.. రాష్ట్రంలో క‌రోనా మృతుల సంఖ్య 92కి పెరిగింది. అలాగే ఇవాళ 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య‌ 1526కి చేరింది. ప్ర‌స్తుతం 1273 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల్లో 446 మంది విదేశాల నుంచి వ‌చ్చిన వారు, వ‌ల‌స కార్మికులు ఉన్నార‌ని ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ‌కు చెందిన లోక‌ల్స్ 2445 మంది క‌రోనా బారిన‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది.

గ‌డిచిన 24 గంటల్లో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 87 మంది కాగా.. మ‌రో 12 మంది వ‌ల‌స కూలీల‌కు పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో ఈ ఒక్క రోజులో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 70 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చ‌ల్ లో 3, న‌ల్ల‌గొండ‌లో 2 క‌రోనా పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. మ‌హబూబ్ న‌గ‌ర్, జ‌గిత్యాల‌, మంచిర్యాల‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

Latest Updates