చేతులెత్తేసిన సర్కార్ : ప్రాణాలు పోగొట్టుకుంటున్న కరోనా బాధితులు

రాష్ట్రంలో కరోనా అనుమానితుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా టెస్టుల కోసం, వాటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూనే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. జ్వరం, దగ్గు, దమ్ము ఉన్న పేషెంట్లను టెస్ట్ రిపోర్ట్ ఉంటే తప్ప హాస్పిటల్ యాజమాన్యాలు చేర్చుకోవడం లేదు. కరోనా టెస్ట్ చేయించుకొని వస్తేనే ట్రీట్‌‌మెంట్ చేస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో టెస్టుల కోసం జనాలు ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్ల దగ్గర బారులు తీరుతున్నారు.

టెస్ట్ రిజల్ట్ రాకముందే..

కరోనా అనుమానితులు శాంపిల్ ఇవ్వడానికే ఒకట్రెండు రోజులు పడుతోంది. శాంపిల్ ఇచ్చిన తర్వాత నాలుగైదు రోజుల వరకు టెస్ట్ రిజల్ట్ రావడం లేదు. ఇంతలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు విడుస్తున్నారు. దవాఖానలో చేరినా.. ఒకటి రెండు రోజులకే చనిపోతున్నారు.

ఆలస్యంగా వచ్చినందువల్లే కాపాడలేకపోయాం అంటూ సర్కార్ చేతులెత్తేస్తుంది. ఆలస్యం ఎందుకు అవుతుందనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. చనిపోతున్నాను డాడి…బైబై అంటూ తండ్రికి సెల్ఫీ వీడియో పంపిన రవికుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. పది దావఖానలు తిరిగినా కరోనా లక్షణాలు ఉన్నాయని అతన్ని ఎవరూ అడ్మిట్ చేసేకోలేదు. నిమ్స్ కు వెళితే టెస్ట్ రిజల్ట్ వస్తే తప్పా ట్రీట్ మెంట్ అని చెప్పారు. గాంధీకి వెళితే పాజిటీవ్ వచ్చిన వాళ్లకే ట్రీట్ మెంట్ చేస్తున్నారు. తిరిగి తిరిగి చెస్ట్ ఆస్పత్రిలో చేరిన తరువాత 48గంటలలోపే అతను కన్నుమూశాడు. అతను చనిపోయిన తెల్లారి టెస్ట్ రిపోర్ట్ లో కరోనా పాజిటీవ్ అని వచ్చింది.

హైదరాబాద్ లోని మెట్టుగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ ముదిరాజ్ కూడా ఇటీవలే చనిపోయారని ఆ పార్టీనేతలు తెలిపారు. వైరస్ లక్షణాలతో గాంధీకి వెళితే పాజిటివ్ ఉంటేనే చేర్చుకుంటామని డాక్టర్లు చెప్పారు. టెస్ట్ లు ట్రీట్ మెంట్ కోసం 4 దవాఖనాలు తిరిగి చివరకు ఆయన చనిపోయారు. తరువాత వచ్చిన టెస్ట్ రిపోర్ట్ లో భాస్కర్ కు వైరస్ సోకినట్లు తేలింది. ఇలా అనేక మంది కరోనా లక్షణాలతో ఇబ్బందిపడతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  కరోనా పేషెంటల్లో చాలా మంది సడెన్ గా గుండె ఆగి చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ట్రీట్ మెంట్ అందించాల్సి ఉంది. కానీ మనరాష్ట్రంలో టెస్ట్ లు చేయించుకోవడమే పెద్దప్రయాసగా మారింది.

మనదగ్గరే కరోనా కష్టాలు

కరోనా లక్షణాలు లేని వాళ్లు అనవసరంగా టెస్ట్ లు చేయించుకుంటున్నారని సర్కార్ చెబుతోంది. కానీ రోజూ వస్తున్న కేసులు చూస్తుంటే ప్రభుత్వ వాదన తప్పని అర్థమవుతుంది. గత పదిరోజులుగా టెస్ట్ లు చేయించుకుంటున్న ప్రతీ   వంద మందిలో 20 నుంచి 30 మందికి పాజిటివ్ వస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో ఈ స్థాయిలో పాజిటివ్ రేట్ నమోదవ్వడం లేదు.  మంగళవారం నాటికి రాష్ట్రంలో  88,563 టెస్ట్ లు చేస్తే అందులో 16,339 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది.  టెస్ట్ పాజిటివ్ రేట్ 18.44 శాతంగా ఉంది. దేశంలోనే అత్యంత ఎక్కువ  కేసులు నమోదైన మహా రాష్ట్రలోనూ 18 శాతమే పాజిటివ్ రేట్. అంటే అక్కడ  మనకంటే 0.44 శాతం తక్కువగానే ఉంది. ఇక రికవరీ రేట్ లోనూ మన కంటే  అన్నీ రాష్ట్రాలు బెటర్ గా ఉన్నాయి.  మన దగ్గర వైరస్ నుంచి కోలుకున్న వారి  శాతం 44.64 ఉండగా, 53.76 శాతం యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  ఒకటి రెండు మినహా దాదాపు అన్నీ రాష్ట్రాల్లో  50 శాతం కంటే ఎక్కువ రికరవీ రేట్ ఉంది. మరణాల రేట్ విషయంలో రాష్ట్రంలో మెరుగ్గా ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. మరణాల్ని దాస్తున్నారన్నన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎందుకింత లేటు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 13 ప్రభుత్వ ల్యాబ్లకు మాత్రమే ఐసీఎంఆర్ నుంచి పర్మిషన్ తీసుకుంది. ఇందులో మ్యాగ్జిమమ్ రోజుకు 2,500 టెస్టులే చేయగలుగుతున్నారు. వీటి కెపాసిటీ 4 వేలని ఓసారి, 5 వేలని మరోసారి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. అసలు కెపాసిటీ మాత్రం 3 వేల కంటే తక్కువేనన్నది రోజూ చేస్తున్న టెస్టు ల సంఖ్యతో స్పష్టమవుతోంది. మరోవైపు రాష్ట్రంలోని 18 ప్రైవేటుల్యాబ్లు కరోనా టెస్టింగ్ కోసం ఐసీఎంఆర్ నుంచి పర్మిషన్ పొందాయి. వీటి టెస్టింగ్‌‌ కెపాసిటీ 8 వేలకుపైగా ఉన్నట్టు సర్కార్ లెక్కలు చెబుతున్నయి. అయితే ఈనెల 17 నుంచి 28 వరకు ప్రైవేటు ల్యాబ్స్లో 9,846 టెస్టు లు మాత్రమే జరిగాయి. దీన్ని బట్టి చూస్తే ప్రైవేటుల్యాబ్స్లో సగటున రోజుకు వెయ్యి కంటే ఎక్కువ టెస్టు లు చేయడంలేదని స్పష్టమవుతోంది. ఇలా టెస్టింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో ఈ రోజు శాంపిల్ తీసుకుంటే, ఇంకో 4 రోజులైన తర్వాత రిజల్ట్‌‌ వస్తోంది.