తువ్వాలు, చీరకొంగే మాస్క్

కరోనా గాలి ద్వారా వ్యాపించదు.. జాగ్రత్తగా ఉంటే చాలు

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. దుబాయ్‌, సౌదీ అరేబియా, ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకే వైరస్‌ సోకిందని తెలిపారు. వీళ్లలో ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారని, ఇద్దరికి గాంధీలో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. మరో అనుమానితునికి కరోనా నెగెటివ్‌ వచ్చిందన్నారు. ఆదివారం బడ్జెట్‌ పద్దులపై చర్చలో ఈటల మాట్లాడారు. కరోనా కొత్త వైరస్‌ కాదని, సార్స్ కు మరో రూపమన్నారు. వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా మూడున్నర శాతం కన్నా ఎక్కువ మంది చనిపోలేదని చెప్పారు.

81 శాతం మందికి హౌస్‌ ఐసోలేషన్‌లో ఉంటే ఏ మందులు లేకుండానే 14 రోజుల్లో వ్యాధి తగ్గిపోతుందన్నారు. 14 శాతం మందికి ఎంబీబీఎస్‌ డాక్టర్‌ చికిత్స సరిపోతుందని చెప్పారు. 95 శాతం మందికి ఈ వైరస్‌ సోకినా ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 5 శాతం మందినే ఐసీయూలో పెట్టి ట్రీట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అక్కడా సాధారణ చికిత్స అందించడం తప్ప వేరే మందులేదని చెప్పారు. రాష్ట్రంలో వ్యాధి లేనప్పుడు ఎందుకు స్కూళ్లు బంద్‌ పెట్టాలని సీఎం అడిగారని.. రేపు నిజంగానే ఇద్దరు, ముగ్గురికి సోకితే నిందిస్తరు కాబట్టి చేయాలని చెప్పినమని తెలిపారు. చైనాలో తీసుకున్న నిర్ణయాలు, నియంత్రణ చర్యలను చూసి అందరూ భయపడుతున్నారని అన్నారు.

ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోండి

‘సర్కారు ప్రకటించగానే అందరూ మాస్క్ లు కావాలని అడుగుతున్నారు. మీ దగ్గరున్న తువ్వాలు, కర్చిఫ్‌, చీర కొంగే మీ మాస్క్‌’ అని మంత్రి అన్నారు. ఇది గాలితో వచ్చే వైరస్‌ కాదని, వ్యాధి సోకిన వ్యక్తి 3 ఫీట్ల దూరంలో తుమ్మితే, ముక్కు చీదితే ఆ తుంపర్లతో ఎదుటి వాళ్లకు సోకుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు చేతులు కడిగితే వ్యాధి రాదని, అనవసరంగా భయమొద్దని సూచించారు. ఒకవేళ వస్తే రాష్ట్ర ప్రజలకు సరిపడా మాస్క్ లు, ట్రీట్‌మెంట్‌కు ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కొన్ని దేశాల ఎకానమీనే కరోనా కుంగ దీస్తోందని, వైరస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండటమే మంచిదని తెలిపారు.

గవర్నమెంట్‌ హాస్పిటళ్లను మంచిగ నడిపిస్తం

రాష్ట్రంలోని పీహెచ్‌సీలను పూర్తిస్థాయిలో నడిపేందుకు ప్లాన్‌ రెడీ చేస్తున్నామని ఈటల తెలిపారు. ఇకపై సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ప్రైవేట్‌ హాస్పిటళ్లలో బిల్లులు, నిమ్స్ లో బెడ్లు, వెంటిలేటర్ల కోసం ఎమ్మెల్యేలకు పైరవీలు చేసే అవసరం లేకుండా ప్రజలకు గవర్నమెంట్‌ హాస్పిటళ్లలోనే మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. గవర్నమెంట్‌ హాస్పిటళ్లకు వెళ్తే ప్రాణం దక్కుతుందనే భరోసా కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

Latest Updates