కరోనా ఎఫెక్ట్ : ఇటలీ నుంచి వచ్చిన 75మంది కొన్నిరోజులు బయటికి రావొద్దు

పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారికి కొన్ని సూచనలు తెలిపింది.  ఇటలీ దేశం నుంచి రాష్ట్రానికి వచ్చిన 75 మంది ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు.

ఫిబ్రవరి 29 నుండి నాలుగు విడతలుగా రాష్ట్రానికి వచ్చిన వారంతా తప్పనిసరిగా 14 రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని,  వైద్య ఆరోగ్య శాఖ నియమాల్ని పాటిస్తూ.. ప్రత్యేక రూంలోనే ఉండాలన్నారు.  రూంలో ఉన్నన్నాళ్లూ కుటుంబ సభ్యులు , బంధువులూ, స్నేహితులెవరినీ  కలవొద్దన్నారు. వారి రూంలో కి మరెవరినీ అనుమతించొద్దన్నారు.

తరచుగా చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలని జాగ్రత్తలు చెబుతూ.. ఇతరులు వారి బట్టలు, టవళ్లు , తదితర వాటిని ముట్టుకోకూడదని చెప్పారు.  వారు ఉన్న గదిలోని అటాచ్డ్ బాత్ రూంను వారే వాడాలని,  ఇతరులు వాడకూడదని చెప్పారు. ఒకవేళ ఇంట్లో ఒకే బాత్ రూం ఉంటే మిగతా వాళ్లందరూ వాడాకే వారు వాడాలన్నారు.

  • బాత్రూమ్ ను వాడాక 1 శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణం తో గానీ , మరేదైనా ద్రావణంతో గాని శుభ్రం చేయాలి.
  • వాడుతున్న సబ్బులూ ,షాంపూలూ ,టవళ్లను ఇతరులు ముట్టుకోకూడదు.
  • వారికి ఆహారాన్ని అందించే వాళ్లు రూం డోర్ బయటినుంచే ఇవ్వాలి
  • ఆహారం తీసుకున్నాక ప్లేట్ ని శుభ్రంగా కడిగి డోర్ బయట పెట్టేయాలి
  • వారికి సంబంధించిన వేస్టేజీని సెపరేట్ బ్యాగులో వేసి రూం బయట పెట్టాలి
  • ఇంట్లోని వేస్టేజీకి కూడా రెండు బ్యాగులు వాడాలి

దగ్గు , జ్వరము , శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలన్నారు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. 24 గంటలూ పని చేస్తున్న కంట్రోల్ రూం నంబరు 0866 – 2410978కు అలాగే ఆరోగ్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేయాలని చెప్పారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రికి రావాల్సి వస్తే 108 అంబులెన్స్ కు కాల్ చేసి అందులోనే  వెళ్లాలని ఆయన చెప్పారు.

Latest Updates