యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ కు గిరాకీ!

న్యూఢిల్లీ: మామూలు రోజుల్లో అయితే యాంటీ–బ్యాక్టీరియల్, జెర్మ్‌ ప్రొటెక్షన్ సబ్బులకు గిరాకీ పెద్దగా ఉండదు. కరోనా పుణ్యమాని వీటికి డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవాలనే ఆలోచనతో జనం వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక నుంచి యాంటీ సెప్టిక్, జెర్మ్‌ కిల్, ప్రివెంటివ్ సబ్బులకు డిమాండ్ మరింత పెరుగుతుందని ఎనలిస్టులు అంటున్నారు. సాధారణ బ్యూటీ సబ్బుల వాడకం తగ్గొచ్చని చెబుతున్నారు. కస్టమర్ల ఆలోచనా విధానం మారిందని గుర్తించిన ఇమామీ, గోద్రెజ్, డాబర్, ఐటీసీ వంటి కంపెనీలు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుల సప్లైని పెంచుతున్నాయి. మనదేశంలో సబ్బుల మార్కెట్ విలువ 3.1 బిలియన్ డాలర్లు కాగా, ఈ కంపెనీల వాటానే సగానికిపైగా ఉంటుంది. డాబర్ ఇండియా ‘శానిటైజ్’ పేరుతో జెర్మ్‌ ప్రొటెక్షన్ సబ్బును తీసుకొచ్చింది. బోరోప్లస్ పేరుతో ఇమామీ రెండు సబ్బుల వేరియెంట్లను, శానిటైజర్లను మార్కెట్ చేస్తోంది. సబ్బులతో తరచూ చేతులు కడుక్కుకుంటే కలిగే లాభాల గురించి విప్రో (సంతూర్) కూడా ప్రచారం చేస్తోంది. ఇక నుంచి చాలా మంది సాధారణ బ్యూటీ సబ్బులు, బాడీవాష్, లిక్విడ్స్కు బదులు ‘ప్రొటెక్షన్’ కాస్మొటెక్స్ వాడుతారని ఎడల్వైజ్ సెక్యూరిటీస్కు చెందిన అబ్నీష్ రాయ్ అన్నారు. ప్రొటెక్షన్, నేచురల్స్ వేరియంట్ కాస్మొటెక్స్ మార్కెట్ షేరును పెంచుకుంటాయని స్పష్టం చేశారు.

అమ్మకాలు పెరుగుతాయ్..

సింతాల్, గోద్రెజ్ నంబర్వన్ బ్రాండ్ల పేరిట సబ్బులు అమ్మే జీసీపీఎల్ తన ప్రొటెక్ట్ బ్రాండ్ ప్రొడక్టులు మరింత అమ్ముడవుతాయని అంచ నా వేసింది. ‘‘హెల్త్ సెగ్మెంట్ తప్పకుండా పుం జుకుంటుంది. అయితే మిగతా ప్రొడక్టుల అమ్మకాలు ఏమీ తగ్గవు”అని గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సునీల్ కటారియా అన్నారు. సబ్బులతోపాటు వేప, నిమ్మ కలిసిన వాషింగ్ పౌడర్లకు కూడా ఆర్డర్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తమ నంబర్వన్ సబ్బును సహజసిద్ధ పదార్థాలతో తయారు చేశామని, ఇది అన్ని రకాలుగా రక్షణ ఇస్తుందని కటారియా వివరించారు. ఇదే బ్రాండు పేరుతో కొత్త వేరియంట్లనూ విడుదల చేస్తామని వెల్లడించారు. సావ్లాన్, వివెల్ పేరుతో సబ్బులను ఐటీసీ అమ్ముతోంది. గత నెల సావ్లాన్ హెక్సా పేరుతో కొత్త సబ్బును విడుదల చేసింది. ఇది వరకే సావ్లాన్ బ్రాండు సబ్బులకు ఆదరణ ఉంది కాబట్టి ఈ కొత్త వేరియంట్ కూడా బాగా అమ్ముడవుందన్నది ఐటీసీ అంచనా. ఈ కంపెనీ సబ్బులకు డెటాల్, హిందుస్థాన్ యూనిలీవర్ సబ్బుల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఈ విషయమై ఐటీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సమీర్ సత్పతి మాట్లాడుతూ వివెల్ సబ్బుల్లో ఆలోవెరా, వేప వంటి వేరియంట్లు ఉన్నాయని, కరోనా కాలంలో వీటికి డిమాండ్ పెరిగిందని అన్నారు.

గత ఏడాది తగ్గుదల

గత ఏడాది బార్ సోపుల అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.5 శాతం నుంచి 4.6 శాతానికి పడిపోయాయి. సబ్బుల మాదిరిగానే మిగతా కిరాణా వస్తువుల అమ్మకాలూ తగ్గాయి. దీంతో హిందుస్థాన్ యూనిలీవర్ డవ్, లక్స్, లైఫ్బాయ్ సబ్బుల ధరలను తగ్గించింది. ఇప్పుడు జనంలో శుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి వీటి అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీలు నమ్మకంతో ఉన్నాయి. అయితే కొత్త బ్రాండ్లు, వేరియంట్ల వల్ల పాత వాటి మార్కెట్ షేరు తగ్గుతుందని రీసెర్చ్ ఫర్మ్ కాంటర్ ఎండీ కె.రామకృష్ణన్ అన్నారు. ఇక నుంచి బ్యూటీ సబ్బులను కూడా కంపెనీలు ఇమ్యూనిటీ బూస్టర్లతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విప్రోకు చెందిన అనిల్ చగ్ మాట్లాడుతూ సబ్బులు వైరస్లను సమర్థంగా అడ్డుకుంటాయని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిందని తెలియజేశారు. ఇదే విషయాన్ని తమ ప్రకటనల ద్వారా జనానికి వివరిస్తున్నామని చెప్పారు. కరోనా భయం ఉన్నంత వరకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రొడక్టుల అమ్మకాలకు ఢోకా ఉండదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates