ఒక్కరోజే 3.52 లక్షల మందికి కరోనా

ఒక్కరోజే 3.52 లక్షల మందికి కరోనా
  • మూడో రోజూ 3 లక్షలు దాటిన డైలీ కేసులు
  • మరో 2,812 మంది మృతి
  • 1.95 లక్షలు దాటిన మరణాలు
  • కోమార్బిడిటీస్ వల్లే 70 శాతం మరణాలు
  • మహారాష్ట్రలో కొత్త కేసులు తగ్గుముఖం
  • 27 కోట్లు దాటిన టెస్టులు
  • దేశంలో ఆదివారం 14,02,367 శాంపిల్స్​ టెస్టు 
  • మొత్తం టెస్టుల సంఖ్య 27,93,21,177కు చేరింది- ఐసీఎంఆర్ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజును మించి రోజు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3,52,991మందికి వైరస్ కన్ఫామ్ అయింది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు మూడు లక్షలకు పైగా నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కు పెరిగింది. సోమవారం ఉదయం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 28 లక్షల మార్కును దాటాయి.మరోవైపు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం 2,812 మంది కరోనాతో చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 832, ఢిల్లీలో 350, యూపీలో 206 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం డెత్స్ 1,95,123కు పెరిగాయి. అయితే దేశంలో 70 శాతం పైగా మరణాలు కోమార్బిడిటీస్ కారణంగానే సంభవించాయని కేంద్రం వెల్లడించింది. ఇక రికవరీ రేటు మరింతగా తగ్గి, 82.62 శాతానికి పడిపోయినట్లు  తెలిపింది.
ముంబైలో కేసులు తగ్గుతున్నయ్
దేశంలోనే కరోనా ఎఫెక్ట్ అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో రెండు రోజులుగా కొత్త కేసులు స్వల్పంగా  తగ్గుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో 66,191 కొత్త కేసులు నమోదు అయ్యాయి. శనివారం కంటే వెయ్యికి పైగా కేసులు తగ్గాయి. ముంబైలోనూ కేసులు తగ్గుతున్నాయి. ఆదివారం 5,498 కేసులు నమోదు కాగా.. సోమవారం 3,840 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్​తో 71 మంది చనిపోయారు. రాష్ట్రంలో మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 832 మంది వైరస్ కు బలైపోయారు. ఏప్రిల్ మొదటి నుంచి చూస్తే డెత్స్ ఏకంగా 200% పెరిగాయి. ఇప్పటి వరకు కరోనా కేసులు 42,95,027, డెత్స్ 64,760 నమోదయ్యాయి. ముంబై సిటీలో మొత్తం కేసులు 6,31,484కు, మరణాలు 12,861కు పెరిగాయి.