100 టీమ్స్ తో కరీంనగర్​లో ఇంటింటి సర్వే

తొలిరోజు 6,188 ఇండ్లలో సర్వే
కరీంనగర్​లో ఇంటింటి సర్వే
మొదలుపెట్టిన 100 టీమ్​లు
20 మంది విదేశాల నుంచి వచ్చినట్టు గుర్తింపు
మరికొందరికి అనారోగ్యం
వారందరినీ ఇండ్లలో క్వారంటైన్​
బయటకు రావొద్దని సూచన
ఆఫీసర్లతో మంత్రి గంగుల సమీక్ష

కరీంనగర్ హెల్త్, వెలుగు: ఇండోనేషియా నుంచి వచ్చిన టీమ్​ కరీంనగర్​లోని పలు ప్రాంతాల్లో తిరగడంతో ప్రభుత్వం గురువారం ఇంటింటి సర్వే మొదలుపెట్టింది. వారు బస చేసిన ప్రాంతం, తిరిగిన ప్రాంతానికి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో పరిశీలన చేపట్టింది. వంద బృందాలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నాయి. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారా, విదేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఎవరినైనా కలిశారా అనేది తెలుసుకుంటున్నాయి. కరీంనగర్​ జనాభా మూడున్నర లక్షలు. నగరంలో సుమారుగా 18 వేల ఇండ్లు ఉంటాయి. కలెక్టరేట్​కు మూడు కిలోమీటర్ల రేడియస్ లో అందులో సగానికిపైగా ఇండ్లు ఉంటాయి. దీంతో వంద టీమ్​లను ఏర్పాటు
చేశారు.

తొలి రోజు 6 వేల ఇండ్లలో..

కరీంనగర్​లో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు  ఇంటింటి సర్వే చేశారు. తొలిరోజు 6,188 ఇండ్లకు వెళ్లి మాట్లాడారు. అందులో 20 మంది ఇటీవలి కాలంలో విదేశాలకు వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. అయితే వారిలో కరోనా లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్​ చేశారు. కొందరి నుంచి శాంపిళ్లను సేకరించారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి ఉన్న వారికి జాగ్రత్తలు సూచిస్తున్నారు. శుక్రవారం కూడా సర్వే కొనసాగనుంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేషన్​కు తరలిస్తారు.  కరీంనగర్​లో పరిస్థితిపై మంత్రి గంగుల కమలాకర్​ అధికారులతో సమీక్షించారు.

టీమ్​ల డ్యూటీ ఇదీ

ఎంపిక చేసిన ప్రాంతంలోని ప్రతి ఇంటిని టీమ్​ సందర్శించి వివరాలు సేకరిస్తుంది. ఇంట్లో ఎంత మంది ఉంటారు. ఫ్యామిలీ వాళ్లు ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఈ మధ్య వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చారా, లేదా వచ్చిన ఎవరినైనా కలిశారా అన్న వివరాలు అడిగి చార్టులో నమోదు చేస్తారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే పరిశీలిస్తారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేషన్​కు తరలిస్తారు. అంతా ఇంటికే పరిమితమై జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులకు రోజూ ఫోన్​ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు.

ఇండ్లలోనే ఉండండి..: గంగుల

జనం కరోనా పట్ల ఆందోళనకు గురికావద్దని, వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్​ చెప్పారు. ప్రభుత్వాస్పత్రిలో మూడు ఐసోలేషన్​ వార్డులను సిద్ధం చేశామని, ఇప్పటివరకు కరోనా లక్షణాలున్న వారెవరినీ గుర్తించలేదని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలకు జనం సహకరించాలని కోరారు. రెండుమూడ్రోజులు ఇండ్లలోనే ఉండాలని, సర్వేకు వచ్చే వారికి అన్ని వివరాలు చెప్పాలని సూ చించారు.

ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో..

ఇండోనేషియా నుండి కరీంనగర్​కు వచ్చిన 10 మంది టీమ్​లోని ఎనిమిది మందికి కరోనా పాజిటివ్​గా గుర్తించిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం ఉదయం నుంచే వంద టీమ్​లతో పరిశీలన చేపట్టింది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. మూడు టీమ్​లకు ఒక సూపర్​వైజర్​, 7 నుంచి 10 టీమ్​లకు ఒక మెడికల్​ ఆఫీసర్​ను ఇచ్చారు. టీమ్​లు గుర్తించిన అనుమానితులెవరైనా ఉంటే మెడికల్ ఆఫీసర్​ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు రిపోర్టులు అందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సర్వే టీమ్​లకు కిట్లు అందచేశారు. అందులో వివరాల సేకరణ చార్టులు, కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తెలిపే కరపత్రాలు, అనుమానితులను గుర్తిస్తే ఇచ్చేందుకు మాస్కులు, స్టెరిలైజర్​ వంటివి ఉన్నాయి. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతోపాటు వైద్యారోగ్యం, కుటుంబ ఆరోగ్యశాఖ, ఆయుష్​, ఆర్​బీఎస్​కె, వైద్య విధాన పరిషత్​ వైద్య సిబ్బందిని రంగంలోకి దించారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates