కరోనా ఎఫెక్ట్: ముకేశ్ అంబానీ రూ.1.11 లక్షల కోట్లు గల్లంతు

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గురువారం 9 శాతం వరకు పడిపోవడంతో, ముకేశ్ అంబానీ సంపద భారీగా గల్లంతైంది. 52 వారాల కనిష్ట స్థాయిల్లో రూ.1,049.50 వద్ద తాకిన ఈ షేరు, 8.20 శాతం నష్టంలో రూ.1,050 వద్ద క్లోజైంది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో ఈ కంపెనీ షేర్లు 28 శాతం వరకు పడిపోయాయి.

సెన్సెక్స్ హడల్, ఇన్వెస్టర్లకు చుక్కలు.. ఆగని అమ్మకాల సెగ

కరోనా దళాల్ స్ట్రీట్‌‌ను దడదడలాడించింది. ఇటు ప్రజలనే కాదు.. అటు స్టాక్ మార్కెట్లను మహమ్మారిలా పట్టిపీడిస్తోంది. గత కొన్ని సెషన్ల నుంచి మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.. తప్ప లేవడం లేదు. రోజు రోజుకు చరిత్రలో ఎన్నడూ లేనంత పతనాన్ని చవిచూస్తున్నాయి.

మార్కెట్లపై కరోనా రక్తపాతం సృష్టిస్తోంది. ఇక్కడ.. అక్కడ అన్ని లేకుండా.. కరోనా ధాటికి అన్ని మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.  చైనాలో పుట్టుకొచ్చిన ఈ వ్యాధిని ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌‌ఓ  ప్రకటించగానే… మరోసారి మార్కెట్లన్ని దడదడలాడాయి. ఈ పతనం.. మన మార్కెట్లపై మామూలుగా లేదు. సెన్సెక్స్‌‌ అయితే ఏకంగా 3,200 పాయింట్లకు పైగా కుదేలైంది.  ఇక నిఫ్టీ గురించి చెప్పనక్కర్లేదు.. ఒక్కసారిగా అన్ని కీలక మద్దతు స్థాయిలను పోగొట్టుకుని 9,600 కిందకు పడిపోయింది. కరోనా వైరస్‌‌ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌‌ఓ) ప్రకటించడం.. వెను వెంటనే యూరోపియన్ దేశాల నుంచి వచ్చే వారిపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించడం ప్రపంచ మార్కెట్లను హడలెత్తించింది. మన దేశం కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప విదేశీ ప్రయాణికులెవర్ని వచ్చే నెల 15 దాకా అనుమతించమని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగిన అమ్మకాల తాకిడికి, మన మార్కెట్‌‌ కూడా కొట్టుకుపోయింది. గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.11.27 లక్షల కోట్లకు పైగా గల్లంతైంది. గత కొన్ని సెషన్‌‌లుగా పడుతోన్న మార్కెట్‌‌ను చూస్తే.. సుమారు రూ.20 లక్షల కోట్ల వరకు ఇన్వెస్టర్లకు సంపద పోయింది.

ప్రారంభంలో పతనం

ట్రేడింగ్ ప్రారంభంలోనే 1,800 పాయింట్లకు పైగా పడిన సెన్సెక్స్.. రోజంతా నష్టాల్లోనే ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. ఒకానొక దశలో 3,204.30 పాయింట్లు మేర దిగజారింది. చివరికి 2,919.26 పాయింట్ల నష్టంతో 32,778.14 వద్ద సెటిలైంది.  నిఫ్టీ 868.25 పాయింట్లు నష్టపోయి, కీలక స్థాయి 9,600ను కోల్పోయి 9,590.15కు పడింది. 2008 అక్టోబర్ 24 తర్వాత, నిఫ్టీ ఈ మేర పడిపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్‌‌లో అన్ని కాంపోనెంట్స్‌‌ రెడ్‌‌గానే ఉన్నాయి. ఎస్‌‌బీఐ స్టాక్ టాప్ లూజర్‌‌‌‌గా ఉంది. ఓన్‌‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ,టైటాన్, బజాజ్ ఆటో, టీసీఎస్, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌ షేర్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి.

ఈక్విటీల నుంచి ఆయిల్‌‌ వరకు పతనం..

ట్రావెల్ ఆంక్షలు గ్లోబల్‌‌ ఎకానమీని మరింత సంక్షోభంలో పడేస్తాయని అనలిస్ట్‌‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌ను బాగా బలహీనపర్చింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ తర్వాత, ఈక్విటీల నుంచి ఆయిల్ ధరల వరకు అన్ని కిందకు పడ్డాయి. ఆసియన్ ఈక్విటీ మార్కెట్లు టోక్యో, సిడ్నీ, హాంకాంగ్, షాంఘైలన్ని భారీగా పతనమయ్యాయి. సియోల్, సింగపూర్, జకర్తా మార్కెట్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. బ్యాంకాక్ మార్కెట్ అయితే 8 శాతానికి పైగా కుదేలైంది. అమెరికా మార్కెట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ 1,500 పాయింట్లకు పైగా పడిపోయింది. ఎస్ అండ్‌‌ పీ ఇండెక్స్, నాస్‌‌డాక్‌‌లు నష్టాల పాలయ్యాయి. ఇండియన్ స్టాక్స్‌‌లో కూడా అమ్మకాల తాకిడి బాగా కనిపించింది. ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(ఎఫ్‌‌ఐఐ) దేశీయ మార్కెట్ల నుంచి తమ మనీని విత్‌‌డ్రా చేసుకుంటూనే ఉన్నారు.

బిగ్‌‌ బుల్‌‌కూ తప్పని నష్టాలు…

దలాల్‌‌ స్ట్రీట్‌‌ పతనం బిగ్‌‌ బుల్‌‌ లాంటి ఇన్వెస్టర్లను తాకింది. బిలీనియర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌‌ఝన్‌‌వాలా ఇన్వెస్ట్ చేసిన షేర్లు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఈయన ఇన్వెస్ట్ చేసిన టైటాన్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు నష్టపోయాయి. లుపిన్‌‌ షేర్లు కూడా ఇలానే పడ్డాయి. ఝన్‌‌ఝన్‌‌వాలా ఇన్వెస్ట్ చేసిన చాలా స్టాక్స్ వాటి గరిష్ట స్థాయిల నుంచి 20 శాతం–80 శాతం వరకు తగ్గిపోయాయి.

కరిగిపోయిన రూపాయి..

డాలర్ మారకంలో రూపాయి విలువ కరిగిపోయింది. 17 నెలల కనిష్టానికి పడిపోయి 74.24 వద్దకు పడిపోయింది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు వరస్ట్ సింగిల్ డే లాస్‌‌ను నమోదు చేయడం, ప్రపంచ మార్కెట్లన్ని పడిపోవడంతో రూపాయి బలహీనపడింది.

Latest Updates