బ్యాడ్‌న్యూస్: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికి సోకుతోంది. తాజాగా.. లండన్‌లో అప్పుడే పుట్టిన శిశువుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ చిన్నారి కేసు ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో కరోనా సోకిన కేసుగా నమోదైంది.

లండన్‌లో ఒక మహిళ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు.. న్యూమోనియా సమస్యతో బాధపడింది. ఆ సమస్యతో ప్రసవానికి ఇబ్బంది కలుగుతుందేమోనని ఆమె ముందుగానే నార్త్ మిడిల్‌సెక్స్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో చేరింది. అయితే ఆమె అక్కడ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే వైద్యులు శిశువుకు కూడా పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో వైద్యులు తల్లీబిడ్డను వేరు వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. బిడ్డకు కరోనా తల్లి కడుపులో ఉండగానే వచ్చిందా లేక పుట్టిన తర్వాత వచ్చిందా అనే విషయం తెలుసుకోవడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. శిశువును అదే ఆస్పత్రిలో ఉంచగా.. తల్లిని మాత్రం ఇన్‌ఫెక్షన్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించి వైద్యం చేస్తున్నారు. చైనాలో ఇటువంటి ఘటనే జరిగింది. ఫిబ్రవరి మొదటివారంలో చైనాలో కరోనా సోకిన మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు జన్మించిన శిశువుకు మాత్రం వైరస్ సోకలేదు.

లండన్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లండన్‌లో కరోనా వ్యాధి బారిన పడి దాదాపు 136 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ 114 దేశాలలో 1,40,000 మందికి పైగా సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా COVID-19 వల్ల 5,000 మందికి పైగా మరణించారు. అందులో 3,000 మంది చైనా వారే కావడం గమనార్హం.

కరోనాకు యూరప్ కంట్రీస్‌ కేంద్ర బిందువుగా మారడంతో.. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం బ్రిటన్ నుంచి వచ్చే వారికి నిషేధం విధించింది.

For More News..

ఢిల్లీ అల్లర్లు: చనిపోయిన ఐబీ ఆఫీసర్ బాడీపై 51 గాయాలు

షాకింగ్ న్యూస్: పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 పెంపు

భారత్‌లో కరోనా వల్ల రెండో మృతి

చెట్లు నరికితే జైలుకే

Latest Updates