వరుస పండుగలతో కరోనా పైపైకి! ఐదు రోజుల్లో 6,798 మందికి వైరస్​

మాస్కులు, ఫిజికల్​ డిస్టెన్స్​పాటించని ఫలితం

ఈ చలికాలం జాగ్రత్త అంటున్న డాక్టర్లు

కరీంనగర్ సిటీలోని రాంనగర్​లో ఈ నెల 24న మహిళలంతా కలిసి సద్దుల బతుకమ్మ ఆడారు. ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. ఫిజికల్​డిస్టెన్స్​సంగతి మొత్తానికే మర్చిపోయారు. పండుగ అయిపోయాక ఒక్కొక్కరిలో సింప్టమ్స్​ కనిపించడం మొదలైంది. టెస్ట్​ చేసుకున్న వారిలో10 మందికిపైగా పాజిటివ్​ వచ్చింది. ఇందులో ఓ ఫ్యామిలీలో అందరూ కరోనా బారిన పడ్డారు. చేసుకోనివాళ్ల సంగతేంటో ఇంకా తెలియదు. దీంతో ఆరోజు బతుకమ్మ ఆడినవాళ్లంతా పరేషాన్​ అవుతున్నారు. 

కరీంనగర్​/యాదాద్రి, వెలుగు:  ‘జనాలు మస్తు తిరుగుతున్నరు. టిఫిన్​సెంటర్లు, రెస్టారెంట్లు ఎక్కడ చూసినా జనమే జనం. బరాత్​ల డ్యాన్సులతో ధూం ధాం చేస్తున్నరు. ఎవలన్నా మాస్కులు పెట్టుకుంటున్నరా? ఎహే పో..ఎక్కడుంది కరోనా..ఎప్పుడో ఖతమైంది. వైరస్​వీకయింది భయ్. చల్ ఊరికి నడువ్​. మనోళ్లను కూడా రమ్మను . ఈసారి దావత్​అదిరిపోవాలె ’ అంటూ దసరాకు చాలామంది ఫుల్​ఎంజాయ్​చేశారు. పట్నంలో ఉండే వాళ్లంతా ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించకుండా కిక్కిరిసిన బస్సుల్లో పల్లెలకు పోయిండ్రు. దసరా నాడు జమ్మి పెట్టుకుని అలయ్​బలయ్​ తీసుకున్నరు. ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా ఉండే మహిళలు కూడా బతుకమ్మ సందర్భంగా కరోనా రూల్స్​పాటించలేదు. గ్రూపులు గ్రూపులుగా కలిసి మాస్కులు లేకుండా, ఫిజికల్​డిస్టెన్స్​పాటించకుండా మామూలు రోజుల్లో ఆడినట్టు బతుకమ్మ సంబురాలు జరుపుకొన్నరు. ఇంత చేసినంక కరోనా ఊకుంటదా… ఎవలకు పడితే వాళ్లకు అంటుకుంది. దసరా పండుగ తర్వాత కేసుల సంఖ్య పెరగడం దీన్ని రుజువు చేస్తోంది. అఫీషియల్​ లెక్కల ప్రకారం ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,798  కేసులు నమోదయ్యాయి. దీంతో డాక్టర్లు వేడుకల్లో పాల్గొన్నవారికి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తున్నారు.

డబుల్ ​అవుతున్న కేసులు

బతుకమ్మ, దసరా పండుగల తరవాత  దాదాపుగా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24న సద్దుల బతుకమ్మ జరుపుకోగా, 25న దసరా సెలబ్రేట్​చేసుకున్నారు. అయితే ఈ రెండు రోజుల్లో టెస్టుల కోసం చాలా తక్కువ మంది వచ్చారు. దీంతో రికార్డుల్లో సంఖ్య తగ్గింది. మరుసటి రోజు 26న స్టేట్ బులిటెన్​ ప్రకారం రాష్ట్రంలో 837 కేసులు  నమోదయ్యాయి. 27న  1,481, 28న 1,504, 29న 1,531, 30న 1,445 కేసులు నమోదయ్యాయి. ఇలా ఐదు రోజుల్లో 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని జిల్లాల్లో కేసుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. గడిచిన ఐదు రోజుల్లో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 588, కరీంనగర్​లో 332​, కామారెడ్డిలో 271,  సిరిసిల్లలో 225, నిజామాబాద్​లో 211​, వరంగల్​ అర్బన్​లో 230, యాదాద్రి జిల్లాలో 178 చొప్పున కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,38,632 కేసులు నమోదు కాగా 1,336 మంది మృతిచెందారు.

షాపింగ్​కూడా కారణమే

దసరా, బతుకమ్మ పండగలకు ముందు జనాలు కరోనా వైరస్ కు భయపడినా.. పండగకు ముందు వారం, పది రోజులు పట్టించుకోలేదు. బట్టల దుకాణాలు, కిరాణ హోల్ సెల్ షాపులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ జనాలతో కిటకిటలాడాయి.  మాస్కు పెట్టుకోవాలి..ఫిజికల్​డిస్టెన్స్​పాటించాలి.. అనే విషయమే మర్చిపోయారు. ఊర్లకు వెళ్లే బస్సుల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక్క కరీంనగర్ రీజియన్ పరిధిలోనే గత బుధవారం సుమారుగా కోటి ఆదాయం వచ్చిందంటే ఎంతమంది ప్రయాణికులు జర్నీ చేశారో అర్థం చేసుకోవచ్చు.

ఈ మూడు నెలలు కీలకం

కరోనా వైరస్ రాష్ట్రంలోకి ఫిబ్రవరి, మార్చిలో ఎంటర్​ అయింది. ఎండలు దంచి కొట్టే టైంలోనూ కేసులు భారీగా నమోదయ్యాయి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. దీంతో వైరల్​ఇన్ ఫెక్షన్లు తొందరగా వ్యాపిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటివి అటాక్  చేస్తుంటాయి.  ఇలాంటి టైంలో కరోనా విజృంభిస్తే కంట్రోల్​ చేయడం కష్టమని డాక్టర్లు అంటున్నారు. చలి తీవ్రత బాగా పెరిగితే మరణాలు కూడా పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. రాబోయే  మూడు నెలలు చాలా కీలకమని, మొదటి లాక్ డౌన్ లో ఎలాగైతే ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉండాలని  సూచిస్తున్నారు.

మాస్క్​, డిస్టెన్స్​ మస్ట్​

కరోనా తగ్గు ముఖం పట్టిందని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్​కాదు. చలికాలంలో కరోనా పెరిగే అవకాశాలుంటాయి. అందరూ
ఫిజికల్ డిస్టెన్స్ పాటించడతోపాటు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కొన్ని దేశాల్లో సెకండ్‍ వేవ్ మొదలై లాక్
డౌన్ పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
-డాక్టర్‍ ప్రవీణ్‍, చెస్ట్ ఫిజీషియన్, కరీంనగర్

ఈ మూడు నెలలు జాగ్రత్త

కరోనా ఎక్కువ మందికి లక్షణాలు లేకుండానే వస్తోంది. చలికాలంలో ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ఏ మాత్రం ఇన్ ఫెక్షన్ సోకినట్లు అనిపించినా వెంటనే టెస్టు చేయించుకోవాలి. దీంతో మిగిలిన వారికి సోకకుండా చూసుకోవచ్చు. ముందు గుంపులు గుంపులుగా  ఉండటం మానుకోవాలి. లాక్​డౌన్​ టైంలో ఉన్నట్టు ఉండాలి. ఈ మూడు నెలలు కీలకం.

-డాక్టర్ సుజాత, డీఎంహెచ్ వో, కరీంనగర్

For More News..

మజ్లిస్ కు భయపడే పటేల్ జయంతి చేస్తలేరు

Latest Updates