బర్త్ డే పార్టీతో 12 మందికి కరోనా

  •     రాష్ట్రంలో కొత్తగా 33 కేసులు నమోదు
  •     ఇందులో గ్రేటర్​ హైదరాబాద్​లోనే 26 మందికి..
  •     వేరే రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన ఏడుగురికి వైరస్
  •     కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో హెల్త్​ టీమ్

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నయి. ఆదివారం మరో 33 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 26 మంది గ్రేటర్ హైదరాబాద్‌‌ వారుకాగా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగొచ్చిన వాళ్లు ఏడుగురు. మొత్తంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,196కు చేరింది. ఇప్పటివరకు 751 మంది డిశ్చార్జికాగా.. 415 మందికి ట్రీట్​మెంట్​ జరుగుతోంది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్​ ఎక్కువగా ఉన్న హైదరాబాద్​లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. కొందరు ఫిజికల్​ డిస్టెన్స్​ను, లాక్​డౌన్​ నిబంధనలను సరిగా పాటించకపోవడంతో వైరస్​ విజృంభిస్తోంది. ఎల్బీనగర్​ జోన్​ పరిధిలో ఇప్పటివరకు 61 కేసులు నమోదుకాగా.. అందులో 12 కేసులు ఒకే సోర్స్​ నుంచి వచ్చినట్టు తేలింది. ఇక్కడి వనస్థలిపురంలోని ఓ ఇంట్లో నిర్వహించిన బర్త్‌ డే పార్టీ ద్వారా 12 మందికి కరోనా వ్యాపించినట్టు గుర్తించారు. సరూర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా బర్త్​డే పార్టీలో వైరస్‌ వ్యాప్తి జరిగిందని, వారి ద్వారా మరికొందరికి విస్తరించిందని అధికారులు తేల్చారు.

వైరస్ బారిన వలస కూలీలు

ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగొస్తున్న కూలీల్లో వైరస్​ బారినపడిన వాళ్లు ఉంటున్నారు. ఆదివారం పాజిటివ్ వచ్చిన 33 మందిలో అలాంటి కూలీలే ఏడుగురు ఉన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రేపల్లి గ్రామానికి ముగ్గురు ఈ నెల ఐదో తేదీన ముంబై నుంచి తిరిగొచ్చారు. వారికి టెస్టులు చేయించగా వైరస్​ పాజిటివ్ వచ్చింది. ఇలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు తిరిగొచ్చిన ముగ్గురు కార్మికులను ఇప్పటికే పాజిటివ్​గా గుర్తించగా.. ఆదివారం మరో నలుగురికి కరోనా సోకినట్టు తేలింది. ఈ నలుగురు కూడా ముంబై నుంచి వచ్చినవాళ్లే.

ఫారిన్​ రిటర్నీస్​ అంతా హోటల్ క్వారంటైన్లలో..

విదేశాల నుంచి వస్తున్నవారిని ఇండ్లకు పంపొంద్దని, హోటల్‌ క్వారంటైన్‌లోనే ఉంచాలని సర్కారు నిర్ణయించింది. శనివారం రాత్రి కువైట్ నుంచి విమానంలో 163 మందిరాగా.. వారిలో ఒకరికి వైరస్ లక్షణాలు ఉండడంతో టెస్టుల కోసం తరలించారు.

కొత్త కేసుల్లో ఎక్కువ హైదరాబాద్​ నుంచే..

గ్రేటర్‌ లో రోజూ కరోనా కేసులు పెరగడం ఆందోళనకరంగా మారింది. జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉన్నా హైదరాబాద్​లో కంట్రోల్​ కావడం లేదు. కొద్దిరోజులుగా నమోదవుతున్న కొత్త కేసులన్నీ హైదరాబాద్‌ నుంచే ఉంటున్నాయి. బుధవారం 11 కేసులు, గురువారం 3 కేసులతోపాటు శుక్రవారం నమోదైన 10 కేసులు ఇక్కడివే. ఇక రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటి 31 కేసుల్లో 30, ఆదివారం వచ్చిన 33 కేసుల్లో 26 మంది గ్రేటర్‌ హైదరాబాద్​కు చెందిన వాళ్లే.

రాష్ట్రానికి మరో హెల్త్​ టీమ్‌

కరోనా కట్టడి చర్యల్లో సాయం చేసేందుకు, పరిస్థి తిపై రిపోర్ట్​ చేసేందుకు తెలంగాణకు మరో హెల్త్​ టీమ్‌ ను పంపిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆ టీమ్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి, పబ్లిక్ హెల్త్ ఎక్స్ పర్ట్, జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన మరో ఆఫీసర్ ఉంటారని పేర్కొంది. తెలంగాణ సహా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న పది రాష్ట్రాలకు ఈ బృందాలను పంపుతున్నట్టు వెల్లడించింది. కరోనా కట్టడిలో రాష్ట్రాల హెల్త్‌  డిపార్ట్‌మెంట్లకు సహకరిస్తాయని తెలిపింది. కేంద్రం నుంచి హైదరాబాద్‌ కు ఇప్పటికే ఓ హెల్త్​ టీమ్​ వచ్చింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. వనస్థలిపురంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. ఆదివారం ఆ ఏరియాలోని కంటెయిన్‌ మెంట్ జోన్లలో పర్యటించి, పరిశీలించింది.

Latest Updates