కట్నం కోసం కరోనా వేధింపులు

భర్త, అత్తమామపై కొత్త పెళ్లికూతురు ఫిర్యాదు

ఒడిశాలోని ముర్తుమా గ్రామానికి చెందిన పూజా సర్కార్‌కు జయంత్ కుమార్‌తో మార్చి 2న పెండ్లి జరిగింది. పెండ్లి సమయంలో పిలగానికి కట్నం బాగనే ఇచ్చిన్రు. రూ.2.5 లక్షలు, బంగారం, బైక్‌తో పాటు మొత్తంగా రూ.5 లక్షల వరకు ముట్టజెప్పిన్రు. ఇంత చేసినా కొత్తగా అత్తగారింటికి వచ్చిన పూజకు మనశ్శాంతి లేకుండా పోయింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధింపులకు గురి చేసిన్రు. ఇంకో 5 లక్షలు ఇవ్వాలని సతాయించిన్రు. అయినా పూజ వాళ్ల వేధింపులను భరించుకుంటనే ఉంది. ఇంతలో ఆమెకు జలుబు, దగ్గు మొదలైంది. జ్వరం కూడా వచ్చింది. దీంతో కట్నం అడిగితే ఇంటలేదని అత్తామామలు, భర్త… పూజకు కరోనా సోకిందని టార్చర్ చేయడం మొదలుపెట్టిన్రు. ఆమెను బెడ్‌పై పడుకోనివ్వలేదు. కిందనే పడుకోవాలని బెదిరించిన్రు. బాత్రూం వాడుకోనివ్వలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆమెను ఇంట్లో నుంచి బహిష్కరించినంత పని చేసిన్రు. ఇక బాధలు భరించలేని పూజ.. భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయంత్ కుమార్, అతని తండ్రిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కట్నం, కరోనా వేధింపులు రెండింటిపై కేసు పెట్టామన్నారు.

Latest Updates