వీడియో: కరోనాను ఎదిరించి పుట్టిన బాలుడు

బాబుకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 800 మందికి పైగా చనిపోయారు. వేలల్లో వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. అలా వైరస్ బారిన పడిన ఒక మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు పుట్టిన బాలుడికి కూడా వెంటనే కరోనా టెస్టులు చేశారు. అదృష్టవశాత్తు బాలుడికి వైరస్ సోకలేదని వైద్యులు తెలిపారు. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో శనివారం ఈ బాలుడు జన్మించాడు. వైద్యులు తగిన రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేసి బాలుడిని బయటకు తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

బాలుడికి న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇంటెన్సివ్ కేర్‌ యూనిట్‌లో ఉంచారు. బాలుడికి వైరస్ సోకలేదని పూర్తిగా నిర్ధారించుకోవడం కోసం మరికొన్ని రోజులు ఐసీయూలోనే ఉంచనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కరోనాను ఎదిరించి పుట్టిన ఈ బాలుడి వార్త సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది. నెటిజన్లు అందరూ ఆ బాలుడిని లక్కీ బోయ్ అని అంటున్నారు. మరికొంత మంది అయితే బాలుడి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates