కరోనా వెళ్లిపోయింది: బెంగాల్ బీజేపీ చీఫ్ ఘోష్

కోల్‌కతా: బెంగాల్‌‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేయడానికి రాష్ట్ర బీజేపీ శాఖ కరోనా వైరస్‌‌‌ అంశాన్ని ఎంచుకుంది. ఈ అంశాన్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్‌‌కు ఎంపిక చేసుకుంది. కరోనా అంతమైందని గురువారం నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో బెంగాల్ బీజేపీ టాప్ లీడర్ చెప్పడం వివాదాస్పదం అవుతోంది. వైరస్ కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం. వైరస్ మన చుట్టూ ఉందని మమతా బెనర్జీ నటిస్తున్నారని ఘోష్ మండిపడ్డారు. కరోనా నెపంతో లాక్‌‌డౌన్ అమలు చేస్తూ వచ్చే ఎన్నికల దృష్ట్యా బీజేపీ ర్యాలీలను కావాలనే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

‘కరోనా వెళ్లిపోయింది. మమతా బెనర్జీ కావాలనే నటిస్తూ లాక్‌‌డౌన్ పెడుతున్నారు. తద్వారా రాష్ట్రంలో బీజేపీ ర్యాలీలు, మీటింగ్స్ పెట్టకుండా అడ్డుకుంటున్నారు. మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు’ అని ధనియాఖలీలో జరిగిన ర్యాలీలో దిలీప్ ఘోష్ చెప్పారు. కరోనా వైరస్‌‌తో అజాగ్రత్త వద్దని, అప్రమత్తంగా ఉంటూ.. మాస్కులు వేసుకుని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రధాని మోడీ ప్రజలకు సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో దిలీప్ ఘోష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కరో్నా వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది నేతలు ఆన్‌‌‌‌లైన్ ర్యాలీలు నిర్వహిస్తున్న సమయంలో పబ్లిక్ మీటింగ్ పెట్టడమేంటని దుయ్యబడుతున్నారు.

Latest Updates